Gujarat Titans Retentions :ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోబోతోందని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరిని రిటైన్ చేసుకోవాలనే దానిపై గుజరాత్ టైటాన్స్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
రిటెన్షన్ లిస్ట్ ఇదే!
గుజరాత్ రిటెన్షన్ లిస్ట్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రధానంగా ఉండనున్నట్లు సమాచారం. గిల్తోపాటుగా అఫ్గానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌ను కూడా అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఓ పోస్టులో గుజరాత్ టైటాన్స్ వీరిద్దరి ఫొటోలను షేర్ చేసింది. ప్రత్యర్థులందరూ శుభ్- రష్ కాంబోను ఇష్టపడతారని పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఈ ఇద్దర్నీ గుజరాత్ అట్టిపెట్టుకుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడతున్నారు. అలాగే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజస్థాన్ రిటెన్షన్ ప్లేయర్స్ వీళ్లే!
అలాగే రిటెన్షన్ చేసుకోబోయే ప్లేయర్ల విషయంలో రాజస్థాన్ రాయల్స్ ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ సంజూ శాంసన్‌తోపాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను అట్టిపెట్టుకోవాలని రాజస్థాన్ డిసైడ్ అయినట్లు ఫ్రాంఛైజీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ద్వారా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎవరిని రూ.ఎన్ని కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంటుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.