Gautam Gambhir Quits Politics:టీమ్ఇండియా మాజీ ప్లేయర్, బీజేపీ ఎంపీ (BJP MP Gambhir) గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన క్రీయాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 'నేను క్రికెట్‌పై దృష్టి సారించాలనుకుంటున్నా. అందుకోసం నన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని గంభీర్ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పీఎం మోదీ, హోమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు.
కాగా, గంభీర్ ప్రస్తుతం దిల్లీ ఈస్ట్ నియోజకవర్గాని (East Delhi Lok Sabha Constituency)కి ఎంపీగా కొనసాగుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేబీ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగన జనరల్ ఎలక్షన్స్‌లో దిల్లీ ఈస్ట్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ పోటీలో గంభీర్ కాంగ్రెస్ అభ్యర్ధి అరవింద్ సింగ్‌పై దాదాపు 3.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంభీర్ నిర్ణయం చర్చనీయాంశమైంది.
గత రెండు సీజన్లపాటు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో ఉన్న గంభీర్ ఈసారి కోల్‌కతా (Kolkata Knight Riders)తో చేరనున్నారు. ఈ విషయాన్ని గంభీర్ గతేడాది నవంబర్‌లో స్వయంగా వెల్లడించారు. ఇక గంభీర్ 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీకి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.