Gambhir Sorry To Mc Cullum:టీమ్ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడు. గంభీర్ నేతృత్వంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2018లో ఆటకు వీడ్కోలు పలికిన గంభీర్ కోచ్, మెంటార్, కామెంటర్ రూపంలో ఆటకు దగ్గరగా ఉంటున్నాడు. అయితే గ్రౌండ్లో ఎల్లప్పుడూ అగ్రెసివ్‌గా ఉండే గంభీర్ తన ప్రొపెషనల్ కెరీర్లో ఒకసారి సారీ చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు క్షమాపణ చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు.
'2012 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అతడిని జట్టులోంచి తప్పించినందుకు జట్టు సభ్యులందరి ముందు మెక్‌కల్లమ్‌కు సారీ చెప్పా. 'నిన్ను తప్పించాడనికి కేవలం జట్టులో అవసరాలు మాత్రమే కానీ నీ పెర్ఫార్మెన్స్ కారణం కాదు' అని మెక్‌కల్లమ్‌కు వివరించా. నా స్థానంలో ఎవరున్నా ఆ నిర్ణయం తీసుకోరు. కానీ, నాకు అందరి ముందు సారీ చెప్పే ధైర్యం ఉంది. క్షమించమని అడగడంలో తప్పేం లేదు. ఒకవేళ నేను టీమ్ అందరి ముందు సారీ చెప్పకపోయి ఉంటే నాకు గిల్టీగా ఉండేది. నాయకత్వం అంటే ప్రశంసలు, క్రెడిట్ తీసుకోవడమే కాదు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అది ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ, నాయకుడిగా ఎదగాలంటే తప్పదు' అని గంభీర్ అప్పటి సందర్భాన్ని వివరించాడు.
అయితే 2012 ఐపీఎల్ కేకేఆర్ ఫైనల్స్‌కు చేరకుంది. తుదిపోరులో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ పేసర్ లక్ష్మీపతి బాలాజీ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీని తీసుకున్నారు. అయితే జట్టులో నలుగురు ఫారిన్ ఆటగాళ్ల నిబంధనల కారణంగా మెక్‌కల్లమ్‌ను తప్పించి మన్విందర్ బిస్లాను జట్టులోకి తీసుకున్నారు. ఇక అప్పటికే జాక్ కలీస్, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్ జట్టులో ఉండడం వల్ల మెక్‌కల్లమ్‌ను తప్పించాల్సి వచ్చిందని గంభీర్ చెప్పాడు.