Kapil Dev Anshuman Gaekwad:టీమ్ఇండియా లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్, బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. గైక్వాడ్ చికిత్స కోసం బీసీసీఐ ఆర్థిక సహాయం చేయాలని కోరాడు. అవసరమైతే తన పెన్షన్ డబ్బులు అన్షుకు ఇస్తామని కపిల్ దేవ్ అన్నాడు. అలాగే మాజీ ప్లేయర్లు మోహిందర్ అమర్నాథ్, సునీల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్సర్కార్, మదన్ లాల్, రవి శాస్త్రీ తదితరులు అన్షూ చికిత్సకు నిధులు సేకరిస్తున్నామని పేర్కొన్నాడు.
'అన్షూను ఇలాంటి పరిస్థితుల్లో చూడడం బాధగా ఉంది. ఆతడితో కలిసి నేను చాలా మ్యాచ్లు ఆడాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అతడికి బీసీసీఐ కూడా ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది. మేం ఎవరినీ బలవంతపెట్టట్లేదు. కానీ, మన జట్టు కోసం అన్షూ ఎన్నోసార్లు ఫాస్ట్ బౌలర్లకు ఎదురునిలబడి ముఖం, ఛాతిపై దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు అతడి కోసం మనమంతా నిలబడాల్సిన సమయం వచ్చింది' అని కపిల్ దేవ్ అన్నాడు.
కాగా, ఇదే సందర్భంగా బీసీసీఐలోని వ్యవస్థీకృత లోపాన్ని కపిల్ దేవ్ ఎత్తిచూపాడు. 'ఈ జనరేషన్ ప్లేయర్లు రెమ్యునరేషన్ బాగానే అందుకుంటున్నారు. సపోర్టింగ్ స్టాఫ్కు కూడా జీతాలు బాగానే ఉన్నాయి. కానీ, మా కాలంలో బోర్డు వద్ద అంత డబ్బు లేదు. ఇప్పుడు అలా కాదు. పరిస్థితి వేరుగా ఉంది. మాజీ ప్లేయర్ల సంరక్షణ బాధ్యతలు బీసీసీఐ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు మనకు అలాంటి వ్యవస్థ లేదు. ఎలాంటిది ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది' అని పేర్కొన్నాడు.