Rohit Kohli Retirement :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ (9 పరుగులు), విరాట్ (5 పరుగులు) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. దీంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ మరో 3-4 ఏళ్లు కెరీర్‌ను కొనసాగించాలని, రోహిత్ మాత్రం ఈ సిరీస్ ముగిశాక ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అన్నాడు. 'విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్లు ఆడొచ్చు. కనీసం మూడేళ్లు ఆడే అవకాశం ఉంది. అతడి ఫిట్‌నెస్ కూడా బాగుంది. ఈరోజు అతడు ఔటైన విధానాన్ని వెంటనే మరిచిపోవాలి. ఇక కెప్టెన్ రోహిత్ విషయంలో ఆందోళన తప్పడం లేదు. ఏదైనా సరే అతడే నిర్ణయం తీసుకోవాలి. టాప్ ఆర్డర్‌లో ఆడేటప్పుడు అతడి ఫుట్‌వర్క్ మెరుగ్గా లేదు. అందుకే పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బంతిని చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు. సిరీస్ ముగిశాక ఏదొక నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నా'
'రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఔటైన తీరు ఇబ్బందికరమే. సాధారణంగా అతడు ఫ్రంట్ ఫుట్ మీద బంతిని చాలా చక్కగా ఆడతాడు. కానీ, ఈసారి పుల్ చేయబోయి పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ ఆడేటప్పుడు ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో ఎటాక్ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అదే సమయంలో వారికి దొరికిపోయాడు. ఆసీస్ ఒక స్పెల్‌లో చేసిన అత్యుత్తమ బౌలింగ్ ఇదే అనుకుంటున్నా' అని శాస్త్రి పేర్కన్నాడు.