11 Players Bowling In T20: టీ20 హిస్టరీలో సంచలనం నమోదైంది. ఒకే ఇన్నింగ్స్‌లో జట్టులోని 11 మంది ప్లేయర్లు బౌలింగ్‌కు దిగి అరుదైన రికార్డు నెలకొల్పారు. ఇందులో వికెట్ కీపర్ సైతం బౌలింగ్ చేయడం విశేషం. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా దిల్లీ- మణిపుర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘటన జరిగింది.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ జట్టులోని 11 మంది ప్లేయర్లు బౌలింగ్ చేసి ఈ రికార్డు సృష్టించారు. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో జట్టులోని 11మంది ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.
వికెట్ కీపర్ సైతం!
మ్యాచ్‌లో ముందుగా మణిపుర్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో దిల్లీ జట్టులోని 11మంది ప్లేయర్లు బౌలింగ్‌కు దిగారు. వికెట్ కీపర్ ఆయూశ్ బదోనీ సైతం రెండు ఓవర్ల బౌలింగ్ చేశాడు. అయితే ఏ ఒక్కరూ 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో ఒకే టీమ్‌లో గరిష్ఠంగా 9మంది బౌలింగ్ చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా 2014లో బంగాల్, కేరళ జట్లు, 2021లో మేఘాలయ జట్టు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించింది. తాజాగా 11 మంది ప్లేయర్లతో బౌలింగ్ చేయించి దిల్లీ ఆ రికార్డు బ్రేక్ చేసింది.