Tribal Youth Success Story : మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజన యువకుడు చేపల వ్యాపారంలో రాణిస్తున్నాడు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు సాంకేతికతను ఉపయోగించి చేపల వ్యాపారంలో అదరగొడుతున్నాడు. యోహన్ అరవింద్ గావిత్ అనే గిరిజన రైతు ప్రస్తుతం యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు.
నందుర్బార్ గిరిజనుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. మిరప, మొక్కజొన్న, గోధుమ, మినుములు, పత్తి వంటి పంటలను రైతులు ఎక్కువగా పండిస్తారు. అయితే కొందరు రైతులు వ్యవసాయంతో పాటు కోళ్లు, మేకలు, పాల వ్యాపారాన్ని చేస్తుంటారు.
8ఏళ్ల కిందట వ్యాపారం ప్రారంభం
అయితే నందుర్బార్ జిల్లాలోని నవాపుర్ తాలూకాలోని భావ్రేకు చెందిన యోహన్ అరవింద్ గావిత్ ఎనిమిదేళ్ల క్రితం తన సంప్రదాయ వ్యవసాయంతో పాటు చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాడు. మత్స్య వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రభుత్వం నుంచి 60 శాతం సబ్సిడీ పొందాడు. ఈ పథకం నుంచి అతడికి 18 బోనుల ఏర్పాటుకు సుమారు రూ.32.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సాయాన్ని సక్రమంగా వినియోగించుకుని గావిత్ తన గ్రామంలోని సరస్సులో చేపల పెంపకం ప్రారంభించాడు. అందులో విజయం సాధించాడు. చేపల వ్యాపారంలో గావిత్ సాధించిన విజయాలకు గుర్తింపుగా దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను సత్కరించనున్నారు.
ఆర్థికంగా లాభపడ్డ గావిత్
గావిత్ చేపల వ్యాపారం వల్ల ఆర్థికంగా లాభపడ్డాడు. అంతేకాకుండా తన చేపల చెరువులో చేప పిల్లలను పెంచి రైతులకు సరఫరా చేస్తున్నాడు. అలాగే తోటి రైతులకు చేపల పెంపకానికి సంబంధించిన సలహాలు ఇస్తున్నాడు. గావిత్ ప్రోత్సహంతో భావ్రే, సమీప గ్రామాల రైతులు చేపల వ్యాపారం వైపు మొగ్గు చూపి సత్ఫలితాలను సాధిస్తున్నారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు
యోహన్ గావిత్ చేపల వ్యాపారంలో సాధించిన విజయాలు రాష్ట్రస్థాయిలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నాయి. మహారాష్ట్ర రాష్ట్ర మత్స్య శాఖ జాయింట్ కమీషనర్ ఈ ప్రాజెక్టును పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ప్రాజెక్ట్ విజయవంతమైందని పేర్కొన్నారు. దీంతో రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యువరైతు గావిత్ను సన్మానించనున్నారు. కాగా, ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, జిల్లా కలెక్టర్ మిట్టాలి సేథీ కూడా ప్రాజెక్టును సందర్శించి యోహన్ గావిత్పై ప్రశంసలు కురిపించారు.
యోహన్ గావిత్ హర్షం
రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై యోహాన్ గావిత్, అతడి భార్య యశోద సంతోషం వ్యక్తం చేశారు. "ఇది మాకు గౌరవం మాత్రమే కాదు మా గ్రామానికి గర్వకారణం కూడా. ప్రభుత్వ రాయితీని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా వ్యాపారాన్ని నిర్మించి కుటుంబ ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని నిరూపించాం" అని యోహన్ గావిత్ పేర్కొన్నాడు.