Longest Test : ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా పొట్టి క్రికెట్‌దే హవా కొనసాగుతోంది. టీ20, టీ10 లీగ్స్‌కు బాగా క్రేజ్ పెరిగిపోవడం వల్ల సుదీర్ఘ ఫార్మాట్ ఉనికి ప్రమాదంలో పడుతోంది. ప్లేయర్స్ దీనికి అంతగా ప్రాధాన్యమివ్వట్లేదనే వాదన ఉంది. జనాదరణ కూడా తగ్గుతోంది. దీంతో భవిష్యత్‌లో టెస్ట్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ ఫార్మాట్‌కు ఊపిరి ఊదాలని ఐసీసీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.
తొలి టెస్ట్ ఎప్పుడు జరిగింది?(First Test Match Year) - ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే బాగా క్రేజ్, ప్రాధాన్యత ఉండేది. అప్పట్లో రోజుల తరబడి ఆడేవారు. మధ్యలో విరామం తీసుకుంటూ వారమైనా, పది రోజులైనా రిజల్ట్ తేలేదాకా ఆడుతూనే ఉండేవారు. 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మొదటి అధికారిక టెస్టు మ్యాచ్ జరిగింది. ఇక ప్రస్తుతం లంక - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ 2545ది. ఈ మధ్యలో టెస్ట్ క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
మొదటి 50 ఏళ్లలో అలా ఆడేవారు - మొదట్లో టెస్టు మ్యాచ్‌లో నిర్దిష్ట గడువంటూ లేకుండా రిజల్ట్ వచ్చే వరకు ఆడేవారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రత్యర్థి స్కోరును అందుకునే దాకా బ్యాటింగ్ ఆడేవారు. ముందుగానే ఆలౌట్ అయితే మాత్రం మ్యాచ్ అయిపోయేది.
1877 నుంచి మొదటి 50 ఏళ్లలో ఆస్ట్రేలియాలో గడువు లేని టెస్టులు ఆడేవారు. ఇంగ్లాండ్‌లో మూడు రోజుల టెస్టులు కూడా జరిగాయి. అయితే నిర్దిష్ట గడువంటూ లేని మ్యాచుల్లో ఏదైనా జట్టు గెలవాలి, లేదంటే మ్యాచ్ అయినా టైగా ముగియాలి. అప్పుడే మ్యాచ్ పూర్తయ్యేది.
ఇక వాతావరణం అనుకూలించకపోతే, లేదా మరే ఇతర కారణాలతో కొన్ని మ్యాచులు డ్రాగా నిలిచేవి. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వంటివి చాలా అరుదు. వికెట్లు పడే వరకు బ్యాటింగ్ చేసేవారు. మధ్యలో ఒక రోజు విరామం తీసుకునేవారు. మళ్లీ రెండు రోజుల ఆట కొనసాగించేవారు. మళ్లీ విశ్రాంతి తీసుకునేవారు. మరో రోజు ఆటను కొనసాగించేవారు. అప్పట్లో బిజీ షెడ్యూల్ క్రికెట్ మ్యాచులు ఉండేవి కావు. మంచిగా క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడుకునేవారు.
మొత్తంగా 1877 నుంచి 1939 వరకు ఇలాంటివి నిర్దిష్ట గడువులేని 100 టెస్టు మ్యాచులు జరిగితే అందులో 96 మ్యాచుల్లో రిజల్ట్ తేలింది. కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే డ్రాగా ముగిశాయి.
8 రోజుల పాటు సాగిన మ్యాచ్(TimeLess Test Match) - ఇక రెండో ప్రపంచ యుద్ధం వరకు ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి మ్యాచులే జరిగాయి. 1929లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ 8 రోజుల పాటు సాగింది.
మొత్తంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మాత్రమే ఇలా నిర్దిష్ట గడువులేని టెస్ట్ మ్యాచులు ఆడాయి. 1947లో ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరిగిన మ్యాచ్ ఏడు రోజుల్లో ముగిసింది. మధ్యలో ఒక రోజు విరామం తీసుకున్నారు. అంటే అది ఆరు రోజుల టెస్టు. అప్పట్లో ఓవర్‌కు 8, 6, 5 బంతుల చొప్పున ఉండేవి.
9 రోజుల ఆట, నిర్దష్ట గడువు లేని చివరి ఆట(Longest Test in cricket) - డర్బన్ వేదికగా 1939లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఇది అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా అంటే ఎక్కువ రోజుల పాటు సాగిన ఆటగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది 10 రోజుల షెడ్యూల్ మ్యాచ్. 9 రోజుల పాటు ఆట సాగింది. మార్చి 3న ఆరంభమైంది. అలా 4, 6, 7, 8, 9, 10, 13, 14 తేదీల పాటు ఆట కొనసాగింది. వాస్తవానికి 11వ తేదీన కూడా మ్యాచ్ సాగాల్సి ఉండగా, వర్షం వల్ల కుదరలేదు.