Dhoni Fan IPL Ticket:'మహేంద్రసింగ్' ధోనీ ఈ పేరు చెప్పగానే అతడి ఫ్యాన్స్ ఊగిపోతారు. జీవితంలో ఒక్కసారైనా ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా చూడాలని ఆశపడుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-17 సీజన్ ధోనీకి ఆఖరి ఐపీఎల్ అని ప్రచారం సాగుతన్న నేపథ్యంలో అతడి కోసం ఫ్యాన్స్ స్టేడియాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చెన్నై సొంత మైదానం చెపాక్లో మ్యాచ్ జరిగితే ఎలాగైనా ధోనీని చూసేందుకు అక్కడి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు.
దీంతో చెన్నై మ్యాచ్కు ఈజీగా టికెట్లు దొరకడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ధోనీని చూసేందుకు ఓ అభిమాని రూ.64000 పెట్టి మరి బ్లాక్‌లో టికెట్లు కొన్నాడు. తనతో పాటు ముగ్గురు కుమార్తెలను స్టేడియానికి తీసుకొచ్చాడు. అది కూడా తన కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బుతో ఈ టికెట్లు కొన్నట్లు సదరు అభిమాని తెలిపాడు. సీఎస్కే- కేకేఆర్ మధ్య ఏప్రిల్ 8న మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అయితే ఓ ధోనీ అభిమాని ఈ మ్యాచ్ ను చూసేందుకు తన ముగ్గురు కుమార్తెలతో స్టేడియానికి వచ్చాడు. తనకు మ్యాచ్ చూసేందుకు మొదట టిక్కెట్లు లభించలేదని, అందుకే టికెట్లను బ్లాక్ లో రూ. 64,000కు కొన్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన ముగ్గురు కుమార్తెల స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదని వెల్లడించాడు.
'చెన్నై, కేకేఆర్ మ్యాచ్ చూసేందుకు నాకు టిక్కెట్లు దొరకలేదు. అందుకే టికెట్లను రూ.64 వేలు ఖర్చు చేసి బ్లాక్‌లో కొన్నాను. అయితే నా కుమార్తెల స్కూల్ ఫీజు ఇంకా చెల్లించలేదు. మ్యాచ్ టికెట్ల కొనుగోలు కోసం నా కుమార్తెల స్కూల్ ఫీజు కట్టలేదు. కానీ ధోనిని ఒక్కసారైనా చూడాలనుకున్నాం. నా కుమార్తెలు, నేను మహీని చూశాం. చాలా సంతోషంగా ఉంది.' అని ధోనీ అభిమాని చెప్పుకొచ్చారు. ' మా నాన్న చెన్నై- కేకేఆర్ మ్యాచ్ టికెట్ల కోసం చాలా కష్టపడ్డారు. ధోనీని స్టేడియంలో చూసి చాలా సంతోషపడ్డాం.' అని ధోని అభిమాని చిన్న కుమార్తె చెప్పింది.