Geofencing To Indiaramma House Scheme Selected Lands : పేదలకు ప్రభుత్వ సాయంతో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లను తొలిసారి జియో ఫెన్సింగ్ చేయనున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇందిరమ్మ ఇళ్లతో దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. 2013లో రాష్ట్రంలో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయడానికి అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో ఫెన్సింగ్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది.
జియో ఫెన్సింగ్ : మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల సర్వే చేసిన అధికారులు సొంత స్థలం ఉన్న నిరుపేదలతో కూడిన ఎల్1 జాబితాను సిద్ధం చేశారు. ఇళ్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపించారు. ఇప్పుడా స్థలం జియో ఫెన్సింగ్ చేయనున్నారు. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసే రోజు గ్రామ కార్యదర్శికి, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాలి.
సర్వేలో చూపిన స్థలం అదేనా కాదా అని వారు ధ్రువీకరించాలి. అనంతరం ప్రత్యేక యాప్‌లో స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాల వివరాలతో జియో ఫెన్సింగ్ చేస్తారు. తర్వాత నిర్మాణంలో ఉన్నప్పుడు తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద నిల్చొని యాప్ ద్వారా పరిశీలిస్తారు. గతంలో ఇచ్చిన వివరాలు మ్యాచ్ అయితేనే ఫొటోలు, వివరాలు యాప్‌లో అప్‌లోడ్ అవుతాయి. ఏమాత్రం తప్పుడు సమాచారం ఉన్నా యాప్ తిరస్కరిస్తుంది.
ఇళ్ల నిర్మాణాలు 20 రోజులు : ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో 42 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. ఎమ్మెల్సీ కోడ్ జిల్లాలో అమల్లో ఉన్నందున ఇళ్ల నిర్మాణాల మొదలు ప్రారంభించేందుకు ఇంకో 20 రోజులు పడుతుంది. ఇక ఎల్1 జాబితా ఇన్‌ఛార్జి మంత్రి అనుమతితో ఆమోదించనుండటంతో స్థానిక ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషించనున్నారు.
గతంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఒక స్థలంలో చూపించి మరో స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం, పాత ఇళ్లకే రంగులు వేసి కొత్తవిగా చూపించి బిల్లులు తీసుకోవడం, బేస్‌మెంట్ లెవల్‌లో మొదటి బిల్లు ఉపాధి నిధుల నుంచి కావడంతో అందినకాడికి దోచుకున్నారు. ప్రస్తుతం జియో ఫెన్సింగ్ ఉపయోగిస్తుండటంతో అలాంటి వాటికి అవకాశం ఉండదు.
ఇక్కడ అన్ని ఫిర్యాదులు స్వీకరించబడును! : ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్‌సైట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ - ఆ లిస్ట్‌లో ఉన్నవారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్స్!
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్