Pocso Cases In Hyderabad : ఏమీ తెలియని వయసు. వారి నిస్సహాయతను ఆసరా చేసుకొని కొందమంది మృగాలు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాలికలను ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేస్తున్నారు. పసితనంలో ఎదురైన చేదు ఘటన నుంచి బయటపడేందుకు భరోసా ద్వారా బాధితులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పసిమనసుపై పడిన ముద్రను దూరం చేసి, సాధారణ స్థితికి చేరేందుకు చేయూత అందిస్తున్నారు.
అసలేం జరుగుతుందంటే : ఓ యువకుడి మాయమాటలు నమ్మిన బాలిక (15) ఇల్లొదిలి అతడితో వెళ్లిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకొచ్చారు. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న బాలిక మాట మార్చింది. తల్లిదండ్రులు తనతో వ్యభిచారం చేయమని ఒత్తిడి తీసుకురావడంతో బయటకు వెళ్లానంటూ చెప్పినట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. నగరంలో బాలికల అదృశ్యం, కిడ్నాప్, లైంగిక దాడులపై ప్రతి నెల 60కి పైగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. వీటిలో 70 శాతం మంది బాలికలు అవతలి వ్యక్తుల మాయమాటలకు లొంగిపోయి, ఇంటి నుంచి వెళ్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తిస్తున్నారు.
పిల్లలపై వేధింపులకు కారణాలు
- కుటుంబ వాతావరణం, గృహ హింస, తల్లిదండ్రుల సంబంధాలు, తల్లి, తండ్రి ఒక్కరే ఉండటం
- ఆర్థిక వెనకబాటుతనం, మద్యం, మత్తుకు బానిస కావటం
- పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం
- సామాజిక మాధ్యమాల ప్రభావం
- మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేని చిన్నారులు
- సంస్కృతి, సంప్రదాయ కట్టుబాట్లు, మితిమీరిన క్రమశిక్షణ
- ఆకర్షణకు గురి కావడం
భరోసా ఏం చేస్తుందంటే..
- బాధితుల అవసరాలను గుర్తించి తగిన సేవలందిస్తున్నారు
- వాస్తవ పరిస్థితులను వివరించటం, సానుకూల వాతావరణం కల్పించి, భయాన్ని దూరం చేయటం, నిపుణుల కౌన్సెలింగ్
- ఆత్మ గౌరవాన్ని పెంపొందించి ప్రవర్తనలో మార్పులను సరిదిద్దటం
- పూర్తిగా కోలుకునేంత వరకూ వైద్య చికిత్స అందించటం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చర్యలు
- న్యాయపరమైన సహాయం
- అవాంఛిత గర్భం దాల్చినప్పుడు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు, మానసికంగా కుంగిపోకుండా చర్యలు
- చిన్నారులను సంరక్షించేందుకు 1098 చైల్డ్‌లైన్ సహాయం
"ఇంటాబయట ఎదురయ్యే ఇబ్బందులు, సంఘటనలను తల్లిదండ్రులతో పంచుకునే వాతావణం కల్పించాలి. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఏఏ అంశాలు వెతుకుతున్నారో గమనించాలి. తప్పొప్పులను వివరించి తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు చెప్పాలి. లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినట్లు గుర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంటాయి. అవసరమైన న్యాయ, వైద్య సహాయం అందిస్తాం." -డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్, డీసీపీ, హైదరాబాద్