Deeparadhana : కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కొందరు ఏడాది వరకూ ఎటువంటి పూజలు చేయరు. అంతేకాదు, కనీసం దీపాన్ని కూడా వెలిగించరు. మరికొందరైతే దేవుళ్ల ఫొటోలు, విగ్రహాలు ఒక వస్త్రంలో చుట్టి అటకమీద ఉంచుతుంటారు. సంవత్సరీకం పూర్తయ్యాక వాటిని కిందకు దింపి శుభ్రం చేసి ఆ తర్వాతే పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంటారు. అయితే, నిజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు నిర్వహించవద్దా? దీపారాధన చేయకూడదా? శాస్త్రం ఏం చెబుతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంట్లో ఎవరైనా చనిపోతే నిజంగానే సంవత్సరం పాటు పూజా కార్యక్రమాలు చేయకూడదా? అనే దానిపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. కుటుంబసభ్యులు మరణిస్తే ఏడాది పాటు పూజలు, దీపారాధన చేయకూడదని ఏ శాస్త్రాల్లోనూ పేర్కొనలేదంటున్నారు.
దీపారాధన చేసుకోవచ్చు!
హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం అనేది శుభానికి సంకేతం. దీపం వెలిగించిన చోట, మనం నిత్యం పూజించే పటాల్లో, విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని చెబుతున్నారు ప్రవచనకర్త చిదంబరశాస్త్రి. అలాంటిది ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేయడం అనేది దోషం కిందకే వస్తుందంటున్నారు. కాబట్టి, ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయొచ్చని శాస్త్రాలే వివరిస్తున్నాయని అంటున్నారు. అప్పటివరకూ చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నింటిని తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించొచ్చని సూచిస్తున్నారు. అయితే, కొత్త పూజలు మాత్రం చేయకూడదని చెబుతున్నారు.
దేవాలయాలకు వెళ్లొచ్చా?
చాలా మందికి ఏటి సూతకంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చా? అనే సందేహం వస్తుంటుంది. ఏటి సూతకం అంటే తల్లి లేదా తండ్రి ఎవరైనా మరణిస్తే సంవత్సరంపాటు ఉండే సమయం. అయితే, ఈ సమయంలో మీకు రోజూ దేవాలయానికి వెళ్లే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్లొచ్చంటున్నారు ప్రవచన కర్త. అలాగే, తీర్థం కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. కానీ, ఆలయ పూజా సేవలో పాల్గొనకూడదట. అంటే శఠగోపం, రుద్రపాదాలను పెట్టించుకోకూడదని సూచిస్తున్నారు.
అదేవిధంగా, ఉత్సవాలు చేయించడం వంటి వాటికీ దూరంగా ఉండాలంటున్నారు. ఏడాది పొడవునా పండుగలు, పుణ్య నదుల్లో స్నానమాచరించడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, అస్తికా సంచయనం చేసినప్పుడు మాత్రం పుణ్య నదుల్లో దిగడంలో తప్పు లేదని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి :
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? - అగ్గిపుల్లతో దీపారాధన చేయవచ్చా?