తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ కెరీర్​లో టాప్ ఇన్నింగ్స్- ఆ మ్యాచ్​తోనే 'ధనాధన్​' ట్యాగ్! - MS Dhoni Birthday - MS DHONI BIRTHDAY

Dhoni Birthday Special: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆదివారం 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఓ సారి గుర్తు చేసుకుందాం.

Dhoni Birthday Special
Dhoni Birthday Special (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 6:34 AM IST

Dhoni Birthday Special:భారత క్రికెట్‌ చరిత్రలో చాలా మంది లెజెండ్స్‌ ఉన్నారు. దేశం కోసం ఎంతో శ్రమించారు, టన్నుల కొద్దీ పరుగులు సాధించారు. వందల కొద్దీ వికెట్లు పడగొట్టారు. ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేయకపోయినా, భారత కీర్తి పతాకం ఎత్తును పెంచిన వారిలో మహేంద్ర సింగ్‌ ధోనీ స్థానం ప్రత్యేకం. మరో కెప్టెన్‌కి సాధ్యం కానన్ని ఐసీసీ ట్రోఫీలు దేశానికి అందించాడు.

ఆదివారం (జులై 7) ధోనీ పుట్టిన రోజు సందర్భంగా, అతడి కెరీర్‌లోని కీలక ఇన్నింగ్స్‌లు ఓ సారి గుర్తు చేసుకుందాం. క్రికెట్ చరిత్రలో ధోనీ ఉత్తమ కెప్టెన్‌గానే కాకుండా బెస్ట్‌ ఫినిషర్‌గా కూడా గుర్తింపు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో ఎక్కువగా 5, 6, 7 స్థానాల్లోనే బ్యాటింగ్‌ చేశాడు. అయినప్పటికీ వన్డేల్లో 50కి పైగా యావరేజ్‌తో 10,000కు పైగా పరుగులు చేయడం ధోనీకే సాధ్యమైంది.

  • 91* vs శ్రీలంక (2011):2011లో వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ధోనీ ఇన్నింగ్స్‌ చరిత్రలో నిలిచిపోయింది. ధోనీ సిక్సర్ కొట్టి భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందించిన క్షణాలు ఎప్పటీకీ ప్రత్యేకమే. ప్రత్యర్థి జట్టులో మహేల జయవర్ధనే(103) రాణించడంతో శ్రీలంక 274/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో భారత్‌ త్వరగానే సచిన్ (18), సెహ్వాగ్ (0) వికెట్లు కోల్పోయింది. గౌతమ్ గంభీర్, కోహ్లీ 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. కోహ్లీ పెవిలియన్‌ చేరగానే, యువరాజ్ సింగ్, రైనా కంటే ముందు ధోనీ క్రీజులోకి వచ్చాడు. గంభీర్‌తో కలిసి 109 పరుగులు జోడించాడు. 79 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు చేశాడు. భారత్ 48.2 ఓవర్లలో 277/4 స్కోరుతో ప్రపంచకప్ ఫైనల్‌ గెలిచింది.
  • 224 vs ఆస్ట్రేలియా (2013):2013 టెస్ట్‌ మ్యాచ్‌లో ధోనీ ఆస్ట్రేలియాపై 224 పరుగులు చేశాడు. భారత వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్టు స్కోరు చేసిన రికార్డు అందుకున్నాడు. 380 పరుగులు వెనుకబడి 196/4 వద్ద భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ క్రీజులోకి వచ్చాడు. విరాట్ కోహ్లీతో కలిసి 128 కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ధోనీ తన ఇన్నింగ్స్‌లో 24 బౌండరీలు, 6 సిక్సర్లు బాదాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 198 పరుగుల ఆధిక్యం సాధించింది. చివరికి భారత్‌ టెస్ట్‌ గెలిచింది.
  • 134 vs ఇంగ్లాండ్ (2017):2017లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. అయితే ధోనీ, యువరాజ్ సింగ్ 256 పరుగుల భాగస్వామ్యంతో ఆటను మలుపు తిప్పారు. యువరాజ్ 150 పరుగులు చేశాడు. ధోనీ 122 బంతుల్లో ఆరు సిక్సర్లు, పది ఫోర్లతో 134 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • 113* vs పాకిస్థాన్‌(2012):2012 డిసెంబర్‌లో చెన్నైలో పాకిస్థాన్‌పై ధోనీ అద్భుత సెంచరీ బాదాడు. భారత్‌లో పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడడం అదే చివరిసారి. భారత్ కేవలం 29 పరుగులకే ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయి కష్టాల్లో పడింది. సురేశ్ రైనా (43)తో కలిసి ధోనీ 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అశ్విన్ (31*)తో కలిసి 125 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పాడు. ధోనీ 125 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేయడంతో, భారత్ 227/6 స్కోర్‌ సాధించింది. భారత్ ఓడిపోయినప్పటికీ, ధోనీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా నిలిచాడు.
  • 183* vs శ్రీలంక (2005):2005లో జైపూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన అత్యధిక వన్డే స్కోరును సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 298/4 పరుగులు చేసింది. భారత్ ఆరంభంలోనే సచిన్ వికెట్‌ కోల్పోయింది. ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 145 బంతుల్లో 10 సిక్సర్లు, 15 ఫోర్లతో అజేయంగా 183 పరుగులు చేశాడు. భారత్ 46.1 ఓవర్లలోనే టార్గెట్‌ రీచ్‌ అయింది. ఈ ఇన్నింగ్స్​తోనే ధోనీకి గుర్తింపు వచ్చింది. అప్పుడే ధనాధన్ ధోనీగా అందరి దృష్టిలో పడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details