David Warner Comeback Test Cricket : వచ్చే నెలలో ప్రారంభం కానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైతే అందుబాటులోకి వస్తానని డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 112 మ్యాచుల్లో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 8,786 పరుగులతో అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికాడు.
ఒకవేళ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తనను వెనక్కి పిలిస్తే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వార్నర్ చెప్పాడు. కీలక బోర్డర్- గావస్కర్ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు, షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా పేర్కొన్నాడు. ఓ స్పోర్ట్స్ న్యూస్ వెబ్‌సైట్‌తో వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఫోన్ కాల్ దూరంలో ఉంటా -వార్నర్ మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. క్రికెట్‌కు సంబంధించి నేనెప్పుడూ సీరియస్‌గా ఉంటాను. ఫిబ్రవరి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక టెస్టు మ్యాచ్ ఆడారు. నేను కూడా దాదాపు అంతే సన్నద్ధంగా ఉన్నా. టోర్నీలో ఆడితే చాలా సంతోషంగా ఉంటుంది. నేను సరైన కారణాల వల్ల ఆటకు వీడ్కోలు పలికాను. కానీ అవసరమైతే జట్టు తరఫున ఎప్పుడూ ముందుంటా. ఈ విషయంలో సిగ్గుపడను" అని వార్నర్ పేర్కొన్నాడు.
- ఆస్ట్రేలియా ఓపెనింగ్ సమస్య -వార్నర్ రిటైర్ అయ్యాక అతడి స్థానంలో ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్‌ను ఆస్ట్రేలియా ప్రయత్నించింది. కానీ ప్రయోగం ఫలించలేదు. స్మిత్ నాలుగు టెస్టుల్లో 28.50 యావరేజ్‌తో 171 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి స్మిత్ తనకు అలవాటైన నాలుగో స్థానానికి తిరిగి వస్తాడని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు.