Geoffrey Boycott Admitted Hospital : ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మళ్లీ ఆయన ఆసుపత్రిలో చేరారు. రీసెంట్‌గానే ఆయన గొంతు క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికెళ్లారు. అంతలోనే మళ్లీ ఆరోగ్యం విషమించడం వల్ల జెఫ్రీని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. నిమోనియా కారణంగా ఆరోగ్యం విషమంగా మారిందని ఆయన కుమార్తె ఎమ్మా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికలో పోస్టు పెట్టి బాధను వ్యక్తం చేశారు.
"మా నాన్న జెఫ్రీ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. మీరు ఇస్తున్న అశేషమైన మద్దతు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తూ పరిస్థితి బాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమోనియా బాగా పెరిగిపోయింది. దీంతో మా నాన్న తిండి కూడా తినలేకపోతున్నారు. కనీసం లిక్విడ్స్ కూడా తీసుకోలేకపోతున్నారు. బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించాం. ప్రస్తుతం ఆయన వెంటిలేషన్ మీద ఉన్నారు. అలానే శ్వాస తీసుకుంటున్నారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాం" అని బాయ్‌కాట్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
కాగా, బాయ్‌కాట్ వయసు ఇప్పుడు 83 ఏళ్లు. మొదటి సారి 2002లో ఆయనకు క్యాన్సర్ సోకింది. ఆ సమయంలో చాలా రోజుల పాటు పోరాడి క్యాన్సర్ బారి నుంచి కోలుకున్నారు. కీమో థెరఫీ కూడా చేయించుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది మే నెలలో క్యాన్సర్ తిరగబెట్టింది. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లారు. కానీ అది జరిగి ఎన్నో రోజులు కూడా జరగలేదు. మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.