Clashes at Football Match In Guinea : పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం జరిగింది. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడి వారు కొందరు పరస్పరం దాడి చేసుకోవడం వల్ల దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏం జరిగిందంటే?
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో దాన్ని వ్యతిరేకించేందుకు ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. అది చూసి అవతలి టీమ్ అభిమానులు ముందుకొచ్చి వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది.
ఓ వైపు మ్యాచ్‌లో గందరగోళం జరుగుతుంటే మరోవైపు వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు. కొందరేమో పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారింది. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి పరిస్థితి దారుణంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.