Champions Trophy 2025 Budget:2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి 70 మిలియన్ల డాలర్ల (రూ.584 కోట్లు) బడ్జెట్‌ను ఐసీసీ గురువారం ఆమోదించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ ఆర్థిక శాఖ సంయుక్తంగా రూపొందించిన బడ్జెట్‌ను బీసీసీఐ కార్యదర్శి జే షా నేతృత్వంలోని ఆర్థిక, వాణిజ్య కమిటీ పరిశీలించి ఆమోదించింది. ఇక అదనపు ఖర్చులకు 4.5 మిలియన్ల డాలర్లు (రూ.34 కోట్లు) కేటాయించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే టీమ్ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించడానికి నిరాకరిస్తే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఈ బడ్జెట్ సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చక్రం తిప్పిన జై షా
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా ఇటీవల రాబోయే ఆసియా కప్ టోర్నీ వేదికలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించారు. టీ20 ఫార్మాట్‌లో జరిగే 2025 ఆసియా కప్ భారత్‌లో జరగనుంది. 2027 ఆసియా కప్, 50 ఓవర్ల టోర్నమెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం?
భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ల వల్లే ఐసీసీకి లాభాలు వస్తాయని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మళ్లీ ఒకే గ్రూప్‌లో ఉంటాయని సూపర్ ఫోర్ దశలో కూడా తలపడవచ్చని, రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే మూడో సారి కూడా ఢీకొంటాయని పేర్కొన్నారు.