Border Gavaskar Trophy 2024 :క్రికెట్ హిస్టరీలో రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లను ప్రత్యేకంగా భావిస్తారు. ఇలాంటి సిరీస్‌లలో విజయం సాధించడాన్ని ఇరుజట్లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి. అలాంటి ఓ సిరీసే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మార్క్యూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగేవి. అయితే ఇకపై ఐదు టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 1991-92 సీజన్ తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లు ఆడుతాయి.
2024-25 సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు చేసిన పోస్టులో "1991-92 తర్వాత మొదటిసారిగా, ఆస్ట్రేలియా, భారత్ ఐదు-టెస్టుల సిరీస్‌లో పోటీపడతాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎక్స్‌టెండెడ్ సిరీస్ 2024-25 హోమ్ సమ్మర్ షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేస్తాం." అని పేర్కొంది.
ఈ అప్‌డేట్‌ని బీసీసీఐ, సీఏ సంయుక్తంగా ప్రకటించాయి. బీసీసీఐ సెక్రట్రీ జే షా, క్రికెట్ ఆస్ట్రేలియా మీడియా ప్రకటనలో " మేము అత్యంత గౌరవంగా భావించే టెస్ట్ క్రికెట్ గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడంలో బీసీసీఐ అంకితభావంలో స్థిరంగా ఉంది’ అని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధికి, మరింత ప్రాధాన్యం కల్పించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ కలిసి కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్ట్‌లకు పెంచాము" అని జే షా స్పష్టం చేశారు. టెస్ట్ క్రికెట్ లెగసీని విస్తరించడానికి, దాని వారసత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.