Australia Media On Virat Kohli :టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మెల్బోర్న్ టెస్టులో చర్చనీయాంశంగా మారాడు. తొలి రోజు ఆసీస్ బ్యాటర్ కాన్‌స్టాస్‌తో వాగ్వాదం, ఐసీసీ 20 శాతం జరిమానాతో విరాట్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మీడియా విరాట్‌ను టార్గెట్ చేసింది. పలు ఆర్టికల్స్‌లో అతడి ఫొటోలను ప్రచురించింది. 'క్లౌన్ కోహ్లీ' (Clown Kohli) అంటే జోకర్ అనే అర్థం వచ్చేలా హెడ్‌లైన్లు పెట్టింది. దీనిపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు.
'ఆస్ట్రేలియా వాళ్ల దేశంలో ఇలానే స్పందిస్తుందని నాకు తెలుసు. ఈ సమయంలోనే మన దేశం మనోళ్లకు ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా. ఆసీస్ మీడియా ఇలాంటి హెడ్‌లైన్లు పెట్టడంలో నాకేం ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆసీస్ గత 13 ఏళ్లుగా మెల్‌బోర్న్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. 2011లో చివరిసారిగా ఓ టెస్టును ఆస్ట్రేలియా గెలిచింది. ఇక ప్రస్తుత మ్యాచ్‌లో కాస్త ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ వచ్చింది. అందుకే ఇలాంటివి ప్రయోగిస్తోంది. ఈ మ్యాచ్తోసహా ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం 1- 1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి.
మీరు ఇంకా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ గెలవలేదు. ఒకవేళ మీరు మెల్‌బోర్న్‌లో గెలిస్తే ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఇప్పటికే నేను ఆసీస్‌లో అనేక సార్లు పర్యటించా. దేశం మొత్తం జట్టుకు అండగా ఉంటుంది. ప్రేక్షకులే కాకుండా మీడియా కూడా ఇందులో ఉంటుంది. అందుకే ఇలాంటివి నాకు సర్‌ప్రైజ్ అనిపించడం లేదు. ఒకవేళ ఆసీస్ 3-0 లేదా 2-0 తో ముందంజలో ఉండుంటే, ఆ హెడ్‌లైన్లు మరింత భిన్నంగా ఉండేవి. ఇలాంటివి ఎక్కడనుంచి వస్తాయో నాకు తెలుసు. నిన్న విరాట్- కాన్‌స్టాస్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు అక్కడి మీడియా ప్రయత్నించింది' అని రవిశాస్ట్రి పేర్కొన్నాడు.