Ashwin Test Retirement : అంతర్జాతీయ క్రికెట్‌కి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా అశ్విన్ ప్రకటించిన నిర్ణయం ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది, అలానే కొన్ని ఘటనలు గుర్తు చేసింది. అదేంటంటే గతంలో అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోని దిగ్గజాలు కూడా ఇదే తరహాలో రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఆ ఇద్దరూ కూడా అశ్విన్ లానే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మధ్యలోనే తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
ధోని, కుంబ్లే తరహాలో
అశ్విన్ రిటైర్మెంట్ 2014 డిసెంబరులో ధోని టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొన్న సందర్భాన్ని గుర్తుకుతెస్తోంది. ఆ సమయంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో భారత్ సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. రెడ్-బాల్ క్రికెట్ నుంచి ధోని వైదొలిగే ఉద్దేశంలో ఉన్నట్లు ఎలాంటి ముందస్తు సూచన లేదు.
అదే విధంగా 2008 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో దిల్లీలో జరిగిన మూడో టెస్టు తర్వాత అనిల్ కుంబ్లే రిటైరయ్యాడు. వేలి గాయం కారణంగా ఇబ్బంది పడుతుండటం కూడా అతడి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఆ సమయంలో భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే ధోనీ, అశ్విన్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిటైరయ్యారు.