Ashwin Jadeja Partnership :భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 339-6 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ (102*), జడేజా (86*) ఉన్నారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాని ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు అజేయంగా 195* పరుగులు జోడించారు. ఈ క్రమంలో చాలా రికార్డులు బద్దలుకొట్టారు.
24 ఏళ్ల రికార్డు బ్రేక్
ఈ భారీ భాగస్వామ్యంతో అశ్విన్, జడేజా 24ఏళ్ల రికార్డు బ్రేక్ చేశారు. అశ్విన్, జడ్డూ ద్వయం టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై 7వ వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జంటగా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు గంగూలీ- సునీల్ జోషి (121 పరుగులు) జోడీ పేరిట ఉంది. వీరిద్దరూ 2000 నవంబర్‌లో ఢాకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ స్కోరు సాధించారు. కాగా, తాజాగా అశ్విన్- జడేజా జోడీ ఈ రికార్డును బద్దలుకొట్టింది.
చెన్నైలోనూ ఇదే టాప్
అదే సమయంలో అశ్విన్ - జడేజా జోడీ చెన్నైలో జరిగిన టెస్టుల్లో అత్యధిక ఏడో వికెట్ పార్ట్‌నర్‌షిప్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇంతకు ముందు ఈ రికార్డు జడేజా- కరుణ నాయర్‌పై ఉంది. 2016లో ఈ జోడీ ఇంగ్లాండ్‌పై ఏడో వికెట్‌కి 138 పరుగులు జోడించారు.
ఎలైట్ క్లబ్‌లో అశ్విన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో 100 వికెట్లు, 1,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఈ రికార్డు అందుకున్న మొదటి ఆటగాడు జడేజా కావడం గమనార్హం.