Arshdeep Singh T20 Record : టీమ్ఇండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ కెరీర్లో అద్భుత రికార్డ్ సృష్టించాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్ ఈ రికార్డు సాధించాడు. 2.5 ఓవర్ వద్ద బెన్ డకెట్‌ను పెవిలియన్ పంపిన అర్షదీప్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం అర్షదీప్ 61 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు నేలకూల్చాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
- అర్షదీప్ సింగ్ - 97 వికెట్లు (61 మ్యాచ్‌లు)
- యుజ్వేంద్ర చాహల్ - 96 వికెట్లు (80 మ్యాచ్‌లు)
- భువనేశ్వర్ కుమార్- 90 వికెట్లు (87 మ్యాచ్‌లు)
- జస్ప్రీత్ బుమ్రా - 89 వికెట్లు (70 మ్యాచ్‌లు)
- హార్దిక్ పాండ్య - 89 వికెట్లు (110 మ్యాచ్‌లు)
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జాస్ బట్లర్ (68 పరుగులు, 44 బంతుల్లో) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. ఫిల్ సాల్ట్ (0), బెన్ డకెట్ (4), లివింగ్‌స్టోన్ (0), జకొబ్ బెతేల్ (7) జిమ్మి ఓవెటన్ (7) వరుసగా విఫలమయ్యారు. తొలుత అర్షదీప్ సింగ్ వికెట్ల వేట ప్రారంభించగా, తర్వాత వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇచ్చాడు.