Anil Kumble Birthday :టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తించడంలో దిట్టగా పేరుపొందాడు. ఇలా రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు విశేష సేవలందించాడు. అయితే గురువారం అనిల్ కుంబ్లే 54వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కుంబ్లే సాధించిన రికార్డులు, నెట్‌వర్త్ తదితర విషయాలు తెలుసుకుందాం.
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు
1999లో దిల్లీ వేదికగా భారత్- పాకిస్థాన్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో బాగానే ఆడింది. వికెట్ కోల్పోకుండా 101 పరుగులు చేసింది. కానీ, అక్కడి నుంచే కుంబ్లే తన ప్రతాపాన్ని చూపెట్టాడు. ఏకంగా ఆ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను పడగొట్టాడు. దీంతో పాక్ 207 పరుగులకే కుప్పుకూలింది. మొత్తం ఈ ఇన్నింగ్స్‌లో కుంబ్లే 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. కుంబ్లే సంచలన ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 212 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఆ మ్యాచ్ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.
దవడ గాయంతోనే
2002లో భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే దవడకు గాయమైంది. అయినా జట్టు కోసం మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేశాడు. 14 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. విండీస్ దిగ్గజం బ్రియన్ లారాదే ఆ వికెట్. అంతలా భారత జట్టు కోసం కుంబ్లే కష్టపడ్డాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.