Ajit Agarkar On Virat Kohli:2024 టీ20 వరల్డ్‌కప్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. దీంతో ఆయా దేశాలు జట్ల ఎంపికపై కసకత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా జట్టు ఎంపికపై కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి టీమ్‌లో అవకాశం దక్కుతుందా? లేదా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. తన ఇంటర్నేషనల్ క్రికెట్ అరంగేట్రం నుంచి కోహ్లి ఇండియా తరఫున ఒక్క ఐసీసీ టోర్నమెంట్ కూడా కోల్పోలేదు.
దాదాపు అన్ని ఐసీసీ టోర్నీల్లో విరాట్ అద్భుతంగా రాణించాడు. కానీ, మొదటిసారి కోహ్లీ ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. అయితే 2022 నవంబర్ నుంచి కోహ్లీ కేవలం రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో కోహ్లీకి రానున్న పొట్టి ప్రపంచకప్‌లో స్థానం కష్టమేనని జోరుగా ప్రచారం సాగింది. కానీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున అదరగొడుతున్న విరాట్ కచ్చితంగా టీ20 జట్టుకు ఎంపికవుతాడని తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఏప్రిల్ చివరి లేదా మే తొలి వారంలో ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో విరాట్ ఎంపిక దాదాపు ఖాయమని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అగార్కర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో విరాట్ గురించి చేసిన కామెంట్లు ఫ్యాన్స్‌కి భరోసా ఇస్తున్నాయి. 'విరాట్ ఫిట్‌నెస్ అద్భుతం. కోహ్లీ తన కెరీర్ మొత్తంలో ఫిట్‌నెస్‌కు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. అతను చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. ఇప్పుడు దాని రిజల్ట్స్ చూస్తున్నాం' అని చెప్పాడు.