AFG VS NZ Greater Noida Stadium : భారత్‌లోని నోయిడా వేదికగా సెప్టెంబర్ 9 - 13 మధ్య అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్లు టెస్ట్ మ్యాచ్‌లో తలపడాల్సింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షాల కారణంగా మైదానం చిత్తడిగా ఉండటం వల్ల టాస్ పడకుండానే తొలి రెండు రోజులకు ఆట క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు మూడో రోజు కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అని ప్లేయర్లు సందిగ్ధంలో పడిపోయారు.
అయితే మ్యాచ్ వేదికగా ఎంచుకున్న గ్రేటర్ నొయిడా స్టేడియంలో కనీస సౌకర్యాలు కూడా లేవని అఫ్గానిస్థాన్ బోర్డ్ ఆరోపిస్తోంది. తాగునీరు, విద్యుత్ సరాఫరా లాంటి మౌలిక వసతులు కూడా సక్రమంగా లేదని, అభిమానులు కుర్చునేందుకు సరైన సీట్లు, మహిళలు ఉపయోగించే వాష్‌రూమ్స్ లేకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు.
అవి సూచించినా వేరే ఆప్షన్ లేక ఎంచుకున్నాం
లఖ్‌నవూ, దెహ్రాదూన్ స్టేడియాలు బిజీగా ఉండటం వల్ల అఫ్గాన్‌కు బీసీసీఐ మరో రెండు మైదానాలను సూచించింది. కాన్పూర్, లేకుంటే బెంగళూరులో ఏదో ఒక స్టేడియంను ఎంచుకోవాలని అఫ్గాన్‌కు సూచించింది. అయితే, నోయిడా తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన అఫ్గాన్ బోర్డు దాన్నే ఎంపిక చేసుకుంది. దిల్లీకి చేరువగా ఉండటం వల్ల తమకు కలిసొస్తుందని అంచనా వేసింది. అయితే ఈ మైదానాన్ని ఎంచుకునే విషయంలో బీసీసీఐ వైపే తప్పు ఉందంటూ అఫ్గాన్ బోర్డ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడం వల్ల తాజాగా బోర్డు ప్రతినిధులందరూ యూ టర్న్ తీసుకున్నారు. తామే నోయిడాను ఎంపిక చేసుకున్నామంటూ వెల్లడించారు.
"మేం మొదట్లో లఖ్‌నవూ స్టేడియం కోసం అడిగాం. ఆ తర్వాతనే దెహ్రాదూన్ను రెండో ఆప్షన్‌గా ఇవ్వాలని కోరాం. కానీ, బీసీసీఐ మాత్రం మా విజ్ఞప్తులను తిరస్కరించింది. ఆ రెండింటీలోనూ ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు టీ20 లీగ్‌లను నిర్వహిస్తున్నాయని పేర్కొంది. అందుకే మేం వేరే ఆప్షన్ లేక నోయిడాను ఎంచుకున్నాం. కానీ, నోయిడా కంటే అఫ్గానిస్థాన్ స్టేడియంలోనే ఇంకా మంచి వసతులు ఉన్నాయి. మా మౌలిక సదుపాయాలను మేము బాగా మెరుగుపర్చుకున్నాం. కానీ, ఇక్కడ మాత్రం ఎటువంటి మార్పులు లేవని మా కెప్టెన్ షాహిది ఇటీవలె అన్నాడు. ఇప్పుడు చూస్తుంటే అతడు చెప్పింది నిజమని అనిపిస్తోంది" అంటూ ఏసీబీ అధికారి పేర్కొన్నారు.ఈ స్టేడియానికి 'వచ్చేందుకు సిద్ధంగా లేం'అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.