World Environment Day 2024 :ప్రకృతికి మానవుడికి అవినాభావ సంబంధముంది. అది ఎంత దగ్గర సంబంధమంటే మనిషి ప్రకృతిలో పుడతాడు. ప్రకృతిలో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు. ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. చివరకు తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు.
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ఒక వేదిక మీదకు వచ్చి, ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవుల వల్ల నాశనమవుతున్న పర్యావరణాన్ని కాపాడడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించి ఒక రోజు ఏర్పాటు చేస్తే మంచిదన్న ఉద్దేశ్యంతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.
తొలిసారిగా ఇక్కడే!
తొలిసారిగా 1972లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. స్వీడన్ వేదికగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినంగా జరపాలని తొలిసారి ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం
1973 నుంచి జూన్ 5న ఏటా ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
ఫీల్ గుడ్ ప్రోగ్రాం
ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే ప్రకృతి ప్రేమికులకు మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే ప్రతి ఒక్కరికీ ఈ రోజు పండుగలానే ఉంటుంది. ఒక్కసారిగా బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో మొక్కలు నాటడం, ప్రతిరోజూ నాటిన మొక్కలకు నీళ్లు పోయడం, తిరిగి స్కూల్ విడిచి పెట్టి వెళ్లే సమయంలో మొక్కలను విడిచి పెట్టలేక బాధ పడటం ఇవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు. అలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని, ఓ మంచి పని చేసిన ఫీల్ పొందుతాం. ఆ ఫీల్ మనలో ఎప్పటికీ ఉంటుంది.
ప్రకృతి ప్రేమే అసలైన ప్రేమ
ప్రకృతిని ప్రేమించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. అలా ఎవరైనా ప్రకృతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పర్యావరణానికి హాని చేయలేరు. పర్యావరణాన్ని పాడు చేస్తే మానవ వినాశనం తప్పదు.
జూన్ 5న ప్రపంచ దేశాలు ఏమి చేస్తాయి?
పర్యావరణ దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఓ చోట సమావేశమై, భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపి నష్ట నివారణకు చేయవలసిన కార్యక్రమాల పట్ల తీర్మానాలు చేస్తాయి. అవగాహన కార్యక్రమాలు జరుపుతాయి.
పాఠశాలల్లో ఇలా!
జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరిస్తారు.
ఆచరణలో శూన్యం
ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సమావేశాలు చర్చలు జరిపి తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఆ తీర్మానాలు ఆచారంలో పెట్టడంలో అందరూ విఫలం అవుతున్నారు.
మానవుడే ప్రధాన ముద్దాయి
భూమికి అత్యంత హాని చేస్తుంది మానవుడే! ప్రపంచ దేశాల ప్రభుత్వాలు రకరకాల వ్యర్థాలను సముద్రంలోకి పంపిస్తున్నాయి. దీనితో జలాలు కలుషితం అవుతున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది. ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వే ప్రకారం, చివరకు ఎవరెస్టు శిఖరం కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. పర్వతారోహకులు ఆహారపదార్ధాలు ఉంచిన ప్లాస్టిక్ కంటైనర్లు తమతో తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో ఈ అనర్థం జరుగుతోంది.
పెరుగుతున్న భూతాపం
నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లతో మట్టి అన్నదే కనుమరుగై పోయింది. భూమిలోకి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా పోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం కోసం చెట్లన్నీ నరికేస్తున్నారు. చివరకు పంట పొలాలు కూడా ఇళ్ల స్థలాలుగా మారిపోతుంటే భూతాపం పెరగక ఏమవుతుంది? ఎండలు పెరిగిపోతున్నాయి, వేడి పెరుగుతోంది అంటున్నారే కానీ దానికి కారణం ఎవరు? మనం కాదా! పది మంది నివసించే ప్రదేశంలో 100 మందికి పైగా ఉంటున్నారు. భూగర్భ జలాలన్నీ తోడేస్తున్నారు. అందుకే భూతాపం పెరిగిపోతోంది.
ప్లాస్టిక్ భూతం
ఇక విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. ఇలా ఎవరికీ వారు నేనొక్కడినే పడేస్తే ఏమవుతుందిలే! అని అనుకుంటూ ఎవరికి వారు శాయశక్తులా పర్యావరణానికి హాని చేస్తున్నారు.
మన కర్తవ్యం ఏమిటి?
'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని' అని ఓ సినీ కవి అన్నట్లుగా ఒకరిని ప్రశ్నించే ముందు, మనల్ని మనం సంస్కరించుకోవాలి. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా పర్యావరణ రక్షణకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
- బజారుకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి సంచీలు తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి.
- విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీలో వేయాలి. లేదా అన్నీసేకరించి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌కు అందజేయాలి.
- ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి.
- మీ బంధుమిత్రుల ఇళ్లల్లో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో వారికి పూల మొక్కను కానుకగా ఇవ్వాలి. మీరు కూడా అలాంటి కానుకలనే స్వీకరించాలి.
- మన పిల్లలకు చిన్న వయసు నుంచే పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసి ప్రకృతి ప్రేమికులుగా మార్చాలి.
- ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండకుండా, మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.
- మన ఇంట్లో చెత్తను మనమే శుభ్రం చేసుకోవాలి.
- మనం నివసించే మన వీధి, మన ఊరు, మన దేశాన్ని కూడా మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.
- చివరగా ప్రకృతిని ప్రేమిద్దాం - మనం ఆరోగ్యంగా ఉందాం - మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందిద్దాం.
ఈ ఏడాది సౌదీలో!
ఈ ఏడాది సౌదీ అరేబియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సమావేశం జరుగనుంది. ఈ ఏడాది థీమ్ "Our Land. Our Future". ఈ సందర్భంగా I LOVE YOU NATURE అని చెప్పేద్దాం.
ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే - హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! - Hanuman Chalisa Chanting Rules
ఆదివారం సూర్యుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు! మరి ఎలా ఆరాధించాలి? - Surya Dev Worship On Sunday