Why Venkateswara Is Worshipped On Saturday :మన పురాణాల్లో, శాస్త్రాల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిదో వివరించారు. శాస్త్రప్రకారం ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమైనది. అలాగే సోమవారం శివునికి ప్రత్యేకమైనది. మంగళవారం సుబ్రమణ్య స్వామిని, ఆంజనేయుని విశేషంగా పూజిస్తూ ఉంటారు. అలాగే బుధవారం గణపతి పూజకు, అయ్యప్ప స్వామి పూజకు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆరాధనకు శ్రేష్ఠమైనది. గురువారం సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకమైనది. శుక్రవారం శ్రీలక్ష్మీ దేవిని, దుర్గాదేవిని పూజిస్తారు. శనివారం మాత్రం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనది. అలాగే శనిదేవుని పూజ కూడా శనివారం విశేషంగా చేస్తారు.
వెంకన్నకు శనివారమంటేనే ఎందుకంత ప్రీతి?
మన పురాణాల్లో చెప్పిన ప్రకారం ఎవరైతే శనివారం రోజు వేంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి శని బాధలుండవని సాక్షాత్తు శని దేవుడు శ్రీనివాసుడికి శనివారం నాడే వరం ఇచ్చాడంట! అందుకే జాతకం ప్రకారం ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు లేదా గ్రహ సంచారం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమ నిష్టలతో శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి తప్పకుండా ఉపశమనం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని భక్తులు తొలిసారిగా దర్శించిన రోజు శనివారమే! అందుకే శ్రీనివాసునికి శనివారమంటే ప్రీతి!
- సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజు శనివారమే! అందుకే శ్రీనివాసుని పూజకు శనివారం విశేషమైనది.
- శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారమే!
- శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసింది శనివారమే!
- శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమే!
- శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్రత్తాళ్వార్ అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే! ఇన్ని ప్రత్యేకతలున్న శనివారం అంటే ఏడుకొండలవాడికి అందుకే పరమ ప్రీతి
వాడవాడలా పూజలు
కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. అందుకే శనివారం నాడు శ్రీనివాసుని భక్తులు ఉపవాసాలు, పూజలు దేవాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శనివారం వెంకన్న ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. తిరుమల ఆలయంలో కూడా శనివారం నాడు విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది.
శనివారం వెంకన్న పూజ ఇందుకే!
మామూలు రోజుల కంటే శనివారం శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని, పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కుతామని, అప్పుల బాధలు, అనుకోని అవాంతరాలు తొలగిపోతాయని వెంకన్న భక్తుల విశ్వాసం.