Devi Navaratri 2024 in Telugu: దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో ఆరాధిస్తుంటారు. ఈ సమయంలోనే ప్రత్యేకమైన ప్రసాదం, వివిధ రకాల పూలతో పూజిస్తుంటారు. ఇలా నవరాత్రుల్లో అమ్మవారిని ఈ ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల పుష్పాలు మాత్రం అమ్మవారి పూజకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని దేవీ భాగవతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాడకూడని పుష్పాలు:
గరిక: దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని గరికపోచలతో పూజించకూడదని కిరణ్ కుమార్ తెలిపారు. దుర్గాదేవి ఉగ్ర స్వరూపంగా ఉంటుందని... గరికలో ఉష్ణాన్ని తగ్గించే గుణం ఉంటుందని.. కాబట్టి ఆమె ఉగ్రత్వాన్ని తగ్గించే గరికపోచలతో దుర్గాదేవిని పూజించకూడదంటున్నారు.
మల్లెపూలు: ఇదే కాకుండా చండీ అమ్మవారు కూడా ఉగ్రత్వంతో ఉంటుందని.. ఆమెను శాంతింపచేసేలా మల్లెపూలతో పూజించరాదని తెలిపారు. అయితే, చండీ దేవత మినహ ఇతర దేవతా స్వరూపాలను నవరాత్రుల్లో మల్లెపూలతో పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి పెరుగుతుందని.. వృథా ఖర్చులు తగ్గిపోతాయని చెబుతున్నారు.
పూజించాల్సిన పుష్పాలు ఇవే:
పద్మ పుష్పాలు:పద్మ పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని దేవీ భాగవతంలో చెప్పినట్లు పేర్కొన్నారు.
గన్నేరు పూలు:దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని గన్నేరు పూలతో పూజిస్తే మంత్ర సిద్ధి త్వరగా కలుగుతుంగదని చెబుతున్నారు. ఇంకా సినీ, రాజకీయ, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు.. ముఖ్యంగా ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే విపరీతమైన జనాకర్షణ, ప్రజాదరణ కలుగుతుందని తెలుపుతున్నారు.
సన్న జాజిపూలు:వాక్శుద్ధి ఉండాలంటే సన్న జాజి పూలతో అమ్మవారిని పూజించాలని చెబుతున్నారు.
తుమ్మిపూలు:తుమ్మిపూలతో అమ్మవారిని పూజిస్తే అన్నపానాలకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.
జిల్లెడు, ఎర్ర తామర పూలు:నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున జిల్లెడు పూలు, ఎర్ర తామర పూలతో అమ్మవారిని పూజిస్తే మన కోరికలు వెంటనే నెరవేరుతాయని 'దేవీ తంత్రం' అనే గ్రంథంలో చెప్పినట్లు పేర్కొన్నారు.