What To Do Everyday In Margashira Month In Telugu :మాసాలలోకెల్లా మార్గశిర మాసం అత్యుత్తమమైనది. ఈ మాటను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే వివరించాడు. అందుకే "మాసానాం మార్గశీర్షోహం" అంటారు. లక్ష్మీ,నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో చేయాల్సిన పూజలు, పుణ్యకార్యాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కృష్ణార్పణం మార్గశీర్షం
వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణంలో వివరించిన ప్రకారం మార్గశిర మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమైనది. ఈ మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ మాసంలో శ్రీ కృష్ణుడిని పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్ని కృష్ణుడి భజనలు కీర్తనలు చేస్తూ ఉండడం వలన కృష్ణుని కృపా కటాక్ష వీక్షణాలను పొందవచ్చు.
- మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి. ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వపాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు.
- మార్గశిర మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇంట్లో నలుమూలలా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సంతోషం వెల్లి విరిస్తుంది.
- మార్గశిర మాసంలో నిత్యం ఓం శ్రీ కృష్ణాయ నమః మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
- మార్గశిర మాసంలో రోజూ తప్పనిసరిగా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు.
- పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో ఇంట్లో కానీ బయట కానీ తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
- మార్గశిరమాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి, లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదునికి పరాశరుడు తెలిపారు.
- మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువును క్రమం తప్పకుండా ఆరాధించాలి. ప్రతి రోజు ఆవునేతితో దీపం వెలిగించి, ఆ వెలుతురులో విష్ణు సహస్ర నామం, భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది.
- మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం విశిష్టమైనది.
- ధనుర్మాసంలో ప్రతి ఇల్లూ అందమైన ముగ్గులతో, గొబ్బెమ్మలతో కళకళలాడుతుంది.
- ధనుర్మాసంలో ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టింది. ఈ రోజు గీతా పారాయణ చేయడంతో పాటు భగవద్గీత పుస్తకాలను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.
- ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకం.
- ధనుర్మాసంలోనే గోపికలు కాత్యాయనీ వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తోంది. అందుకే వివాహం కావలసిన వారు మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతం చేయడం వలన త్వరగా వివాహం జరుగుతుంది.
- మార్గశిర పౌర్ణమి విశేషమైన పర్వదినం. ఈ రోజునే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు చేసే నదీస్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది.
- శీతాకాలంలో వచ్చే మార్గశిర మాసంలో దుప్పట్లు, కంబళ్ళు దానం చేయడం మంచిది.