తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

తులసి కోట దగ్గర ఈ తప్పులు చేస్తున్నారా? - ఐశ్వర్యం నశించి ఆర్థిక ఇబ్బందులు తప్పవు! - Avoid These Mistakes at Tulasi

Tulasi: లక్ష్మీ కటాక్షం కోసం చాలా మంది తమ ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుంటుంటారు. నిత్యం ఆ తులసి కోటకు పూజలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల ఐశ్వర్యం నశిస్తుందని.. ఆర్థిక బాధలు చుట్టుముడతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఆ తప్పులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Avoid These Mistakes at Tulasi Plant
Avoid These Mistakes at Tulasi Plant (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Aug 27, 2024, 2:52 PM IST

Avoid These Mistakes at Tulasi Plant:హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటుంటారు. నిత్యం పూజలు కూడా చేస్తుంటారు. కేవలం తులసిని పూజించడానికి మాత్రేమే కాకుండా.. మూలికా వైద్యంలో కూడా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే తులసిలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఇంత ప్రాముఖ్యత కలిగిన తులసి విషయంలో కొందరు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే తులసి మొక్క విషయంలో ఈ తప్పులు చేస్తే ఐశ్వర్యం నశించి.. ఆర్థిక బాధలు ఇబ్బంది పెడతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ.. ముఖ్యంగా మహిళలు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

  • చాలా మంది విష్ణుమూర్తిని పూజించడం కోసం.. తులసి కోటలోని దళాలను తెంపి పూజకు ఉపయోగిస్తుంటారు. కానీ అలా చేయకూడదని కిరణ్​ కుమార్​ అంటున్నారు. ఒకవేళ విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలనుకుంటే తులసి కోట పక్కన మరో తులసి మొక్కను నాటుకుని ఆ ఆకులను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
  • కొద్దిమంది తమ ఇంట్లో తులసిని నాటుకోవడానికి మొక్క ఇమ్మని ఇతరులను అడుగుతుంటారు. దీంతో చాలా మంది తాము పూజిస్తున్న మొక్కను నాటుకోవడానికి ఇస్తుంటారు. ఇలా పూజ చేసిన తులసి మొక్కను ఇవ్వడం తప్పంటున్నారు.
  • పలు కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతే.. చాలా మంది ఎండిపోయిందని అంటుంటారు. కానీ అలా అనకూడదని కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. తులసి మొక్క ఎండిపోయిందని అనకుండా నిద్రపోయింది అనాలని చెబుతున్నారు. అలాగే అలా నిద్రపోయిన మొక్కను ఎక్కడపడితే అక్కడ కాకుండా పారేనీటిలో వదలాలని సూచిస్తున్నారు.
  • తులసి కోట మీద దుస్తులు ఆరేసిన నీళ్లు పడకూడదని సూచిస్తున్నారు. అలా పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని అంటున్నారు.
  • చాలా మంది తులసి కోటకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటారు. అయితే అలా పోసే నీటిని ఎలా పడితే అలా పోయకూడదని అంటున్నారు. అంటే ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ పోయకూడదని చెబుతున్నారు. నీళ్లు ఎప్పుడూ సమానంగా పోయాలని.. అలాగే మొక్క వేర్లు తడిచేలా పోయాలని అంటున్నారు.

పవిత్రమైన శ్రావణ మాసంలో - తులసి పూజ ఇలా చేయండి - డబ్బు సమస్యలు తప్పక దూరమవుతాయి!

  • తులసి కోట దగ్గర దీపం పెట్టే విషయంలో కూడా ఈ తప్పులు చేయకూడదని అంటున్నారు. చాలా మంది ప్లేస్​ లేదనో మరేదో కారణంతో తులసి కోటకు దగ్గరగా దీపం పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఆకులు కమిలిపోతాయని అంటున్నారు. కాబట్టి దీపం పెట్టాలనుకుంటే కనీసం మూడు అంగుళాల దూరంలో పెట్టాలని చెబుతున్నారు.
  • చాలా మంది ఇంట్లో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు. పూజ పూర్తైన తర్వాత పసుపు గణపతిని తులసి కోటలో పెడుతుంటారు. అయితే ఇలా కూడా చేయవద్దని సూచిస్తున్నారు. కేవలం వినాయకచవితి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి తులసి కోట వద్ద పెట్టుకోవచ్చని.. మిగిలిన రోజుల్లో పెడితే ఐశ్వర్యం నశిస్తుందని హెచ్చరిస్తున్నారు.
  • తులసి కోటలో పసుపు గణపతి ప్లేస్​లో శివలింగం పెట్టుకోవచ్చని చెబుతున్నారు. అభిషేకాలు, పూజలు కూడా చేసుకోవచ్చని అంటున్నారు.
  • చాలా మంది తులసి దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోస్తుంటారు. కానీ అలా కూడా చేయొద్దంటున్నారు. తులసి ఆకులను కేవలం సోమవారం, బుధవారం, శనివారం రోజుల్లో మాత్రమే కోయాలని అంటున్నారు.
  • అలాగే అమావాస్య, ద్వాదశి, పౌర్ణమి తిథుల నాడు తులసి ఆకులను కోయకూడదని అంటున్నారు. శ్రవణా నక్షత్రం ఉన్నరోజు కూడా కోయొద్దని అంటున్నారు. అలాగే తులసి ఆకులను కేవలం మధ్యాహ్నం మాత్రమే కోయాలని, సాయంత్రం, రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదని అంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోయాల్సి వస్తే విష్ణుమూర్తిని స్మరించుకుని కోయవచ్చని సలహా ఇస్తున్నారు.
  • ఆరోగ్యం బాగుండాలని విష్ణుమూర్తిని తులసి దళాలలతో పూజించాలనుకున్నప్పుడు.. దక్షిణం లేదా పడమర వైపు తిరిగి తెంపి.. వాటితో విష్ణుమూర్తిని పూజించవచ్చని సూచిస్తున్నారు.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details