Vrishchika Sankranti 2024 : సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. నవంబర్ నెలలో సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఏర్పడే వృశ్చిక సంక్రాంతి రోజు ఏ దేవుని ఆరాధించాలి? ఎలాంటి దానాలు చేయాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వృశ్చిక సంక్రమణం ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 16వ తేదీ ఉదయం 6:12 నిమిషాల నుంచి 7:41 నిమిషాల మధ్యలో సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇందులో పుష్కర కాలం 7:31 నిమిషాలని పంచాంగ కర్తలు, పండితులు తెలియజేస్తున్నారు. ఈ మొత్తం గంటా 29 నిమిషాల కాలాన్ని మహా పుణ్యకాలంగా అభివర్ణిస్తారు.
వృశ్చిక సంక్రమణం ప్రత్యేకత
ఓ వైపు కార్తిక మాసం హడావుడి. ఇటు శివాలయాలు, అటు వైష్ణవ ఆలయాలు భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇంతటి పరమ పవిత్రమైన మాసంలో ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడాన్ని వృశ్చిక సంక్రమణమని అంటారు.
ఇవి ఆచరిద్దాం
అసలే కార్తిక మాసం. అందునా వృశ్చిక సంక్రమణం. ఈ రోజు నదీ స్నానాలకు విశేషమైన రోజు. నదీ స్నానంతో పాటు ఆచరించాల్సిన ఇతర విధి విధానాల గురించి ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం.
పూజా విధానం
ఇతర సంక్రాంతుల మాదిరిగానే వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం వేళ శుభ ఫలితాలొస్తాయి. ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఒక రాగి పాత్రలో నీరు నింపి, అందులో ఎర్రచందనం కలిపి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. కుంకుమ, ఎర్రని పువ్వు, పసుపు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి.