Vivaha Panchami 2024 :హిందూ పండగల్లో వివాహ పంచమికి విశేష ప్రాముఖ్యత ఉంది. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో నిండటానికి దంపతులిద్దరూ కలిసి చేసుకునే పండుగ వివాహ పంచమి. ఈ సందర్భంగా ఈ ఏడాది వివాహ పంచమి ఎప్పుడు జరుపుకోవాలి? వివాహ పంచమి రోజు ఎలాంటి ఆచారాలు పాటించాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
వివాహ పంచమి ఎప్పుడు?
ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథి రోజు వివాహ పంచమి జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర శుద్ధ పంచమి డిసెంబర్ 5వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:50 గంటల నుంచి మరుసటి రోజు డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:08 గంటల వరకు ఉంది. సాధారణంగా పండుగలు సూర్యోదయం తిధి ఆధారంగా జరుపుకుంటారు. అందుకే డిసెంబర్ 6న శుక్రవారం రోజునే వివాహ పంచమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. వివాహ పంచమి పూజకు ఈ రోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు శుభసమయం.
వివాహ పంచమి విశిష్టత
వైవాహిక జీవితం సుఖంగా, సంతోషంగా ఉండాలని దంపతులు, నూతన వధూవరులు ఆనందంగా జరుపుకునే పండుగ వివాహ పంచమి. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ప్రకారం ఈ రోజునే శ్రీరాముడు సీతా దేవికి వివాహం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ రోజున నూతన వధూవరులు, దంపతులు భక్తితో పూజలు, వ్రతాలు చేస్తే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు రావని విశ్వాసం. ఈ రోజున చేసే పూజలు భార్యభర్తల మధ్య ప్రేమ, సానుకూలత, సామరస్యాన్ని పెంచుతాయని భక్తులు విశ్వసిస్తారు.
వివాహ పంచమి పూజ విధానం
వివాహ పంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. శ్రీరాముడు సీతాదేవిల అన్యోన్య దాంపత్యాన్ని గుర్తుచేసుకుంటూ వారి చిత్రపటాలను పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజించాలి. పులిహోర, పాయసం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి.
ఆలయాల్లో ఇలా
కొన్ని ప్రాంతాలలో ఈ రోజు రామాలయాలలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా దంపతులు ఆలయంలో రాముల వారి కల్యాణ వేడుకలు కనులారా వీక్షించి తలంబ్రాలు అక్షింతలుగా శిరస్సున ధరించాలి.