Vishnu Sahasranamam History in Telugu: హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వాటిలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకటి. సహస్ర అంటే వెయ్యి. అంటే ఈ స్తోత్త్రంలో వెయ్యి నామాలు ఉంటాయి. శ్రీమన్నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ నామాలు విన్నా, చదివినా మోక్షం సిద్ధిస్తుందని చెబుతుంటారు. అయితే విష్ణు సహస్రనామాల గురించి వినడమే కానీ, వాటిని మొదటిసారి ఎవరు పఠించారు? ఎవరు లిఖించారు? అనే వివరాలు చాలా మందికి తెలియదు. జనవరి 10 ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే వేయి నామాలు. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావనా వస్తుంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. అయితే భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపూ అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు.
అంతా అయిపోయిన తర్వాత వాటిని గ్రంథస్తం చేస్తే బాగుండేదనే ఆలోచన అందరికీ వచ్చిందట. అప్పుడు కృష్ణుడి సలహాతో పాండవులలో చిన్నవాడైనా సహదేవుడు ఈశ్వరుడిని పూజించి స్ఫటికను పొందాడు. ఆ స్ఫటిక సాయంతో ఆ నామాలను మళ్లీమళ్లీ వినిపించేలా చేస్తే, వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు. ఆ విధంగా మనకు విష్ణసహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డరుగా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతి కూడా పేర్కొనడం విశేషం.