Game Changer Telugu Review : స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్, సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఓ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్. కాలేజీలో తను ప్రేమించిన దీపిక (కియారా అడ్వాణీ) కోసం తన పర్సనాలిటీని మార్చుకుంటాడు. తనలోని కోపాన్ని తగ్గించుకోవడమే కాకుండా, ఆమె కోసమే ఐఏఎస్ అవుతాడు. అయితే బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్‌తో వార్ మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్). పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి సీఎం పదవి కోసం ఎటువంటి ఎత్తులు వేశాడు? తనకు అడ్డొచ్చిన రామ్ నందన్‌ని అధికార బలంతో ఏం చేశాడు? రామ్‌నందన్ మోపిదేవిని ఎలా ఎదుర్కొన్నాడు? అభ్యుదయ పార్టీ, అప్పన్న (రామ్‌చరణ్), పార్వతి (అంజలి)తో రామ్ నందన్‌కి ఉన్న సంబంధం ఎంటి? ఇటువంటి విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే :
'ఒకే ఒక్కడు', 'శివాజీ'లో టచ్ చేసినట్లుగానే వ్యవస్థ, ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్‌కు అలాగే పొలిటికల్ లీడర్‌కు మధ్య సాగే యుద్ధం ఇది. అక్కడక్కడా శంకర్ మార్క్ విజువల్స్, అప్పన్న ఎపిసోడ్ తప్ప కథనం పరంగా, ఎమోషన్స్ పరంగా ఈ చిత్రం పెద్దగా మనసుల్ని హత్తుకోదు. వాస్తవికతతో కూడిన సినిమాలను ఇష్టపడుతున్న జనరేషన్ ఇది. వాళ్లకు స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడని ఓ కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి లేకుంటే, వాస్తవానికి దగ్గరగా అనిపించే కథనైనా తెరకెక్కించాలి. అయితే 'గేమ్ ఛేంజర్' ఈ రెండింటికీ దూరంగా సాగింది.
ఎన్నికల సంఘం, శాసన వ్యవస్థ వంటి అంశాల చుట్టూ సాగే ఘటనల సమాహారంగా ఈ సినిమా సాగుతుంది. మీడియా, సామాజిక మాధ్యమాల హవా నడుస్తోన్న ఈ రోజుల్లో ఎలక్షన్స్ గురించి సామాన్యుడు సైతం తెలుసుకుంటున్నాడు. అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఊరించిన శంకర్ఆ నేపథ్యాన్ని 90స్లో వచ్చిన సినిమాల్లా పూర్తి నాటకీయంగా, సహజత్వానికి దూరంగానే చూపించారు. 'ఒకే ఒక్కడు'లో ఒక్క రోజు సీఎంని గుర్తు చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా. ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకున్న రామ్ నందన్ అక్రమార్కుల భరతం పట్టడం, అవినీతి అధికారుల్ని ఏరిపారేయడం లాంటి సీన్స్ కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికీ, రామ్ నందన్‌కీ మధ్య మొదలయ్యే ఘర్షణ ఈ సినిమాను కాస్త ఇంట్రెస్టింగ్గా నడిపిస్తోంది.
అయితే అంతలోనే మొదలయ్యే రామ్ నందన్ ఫ్లాష్‌బ్యాక్ సినిమాను మరో దారి పట్టిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా రామ్ చరణ్ నయా లుక్‌లో కనిపించినా, ఆ నేపథ్యంలో వచ్చే లవ్ స్టోరీ ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇంటర్వెల్ సీన్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన ఫ్లాష్‌బ్యాక్ పెద్దగా మెప్పించకపోయినా, సెకెండాఫ్‌లో వచ్చే అప్పన్న ఎపిసోడ్‌తో శంకర్ ఆడియెన్స్‌ను కట్టి పడేశాడు. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో మంచి డ్రామా పండింది. అది పూర్తవ్వగానే మళ్లీ సాధారణంగా మారిపోయింది సినిమా. ఒక ఎన్నికల అధికారి ఓటుకు డబ్బు తీసుకోమని చెప్పడం, ఎర వేయడానికి డబ్బుని తరలిస్తున్నారంటూ చెప్పినా వదిలేయమని ఆదేశాలు ఇవ్వడం, రౌడీలకు భయపడి, వాళ్ల నుంచి ఈవీఎంలని కాపాడుకోవడానికి డ్రోన్‌లు ఉపయోగించడం లాంటి సీన్స్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే :
మూడు కోణాల్లో సాగే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్‌గా ఆయన నటనతో మెప్పించారు. తన లుక్స్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అప్పన్న పాత్రలో ఆయన నటన మరింత ఇంప్రెస్సివ్‌గా అనిపిస్తుంది. అయితే కియారా అడ్వాణీ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రమే ఆమె అందంతో కట్టిపడేస్తుంది. నటనకి ప్రాధాన్యమున్న పార్వతి పాత్రలో అంజలి కట్టిపడేసింది. ఆమె రెండు రకాల లుక్స్‌తో కనిపిస్తుంది. ఆమె పాత్ర నేపథ్యంలోనే ఎమోషన్స్ బాగా పండాయి.
మినిస్టర్ మోపిదేవిగా ఎస్.జె.సూర్య నటన సినిమాకి హైలైట్‌గా నిలిచింది. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే, అక్కడక్కడా ఆయన ప్రేక్షకులను నవ్వించాడు. శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో రెండు లుక్స్‌తో సందడి చేస్తారు. కథని మలుపుతిప్పే కీలక పాత్ర ఆయనది. జయరాం, సముద్రఖని, రాజీవ్ కనకాల ఇలా అందరూ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. సునీల్‌ది సైడ్ యాంగిల్ పాత్ర. అలా చూపెట్టడం తప్ప ఆ క్యారెక్టర్లో కొత్తదనమేమీ లేదు. బ్రహ్మానందం ఇలా కనిపించి అలా మాయమవుతారు. పృథ్వీ, రఘుబాబు తదితరుల పాత్రలకి చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేదు.
ఇక ఈ చిత్ర సాంకేతక విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. తిరు విజువల్స్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేశారు. ప్రతి సీన్స్ గ్రాండియర్‌గా కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధానబలంగా నిలిచింది. పాటల కంటే కూడా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. 'జరగండి', 'రా మచ్చా' పాటలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.
అరుగుమీద పాట ఆకట్టుకుంటుంది. ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. ముఖ్యంగా మోనిక, రామకృష్ణ, అవినాష్‌ల ఆర్ట్ టీమ్ శ్రమ ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది. రైటింగ్ పరంగానే సినిమాకి లోటు జరిగింది. మాటలు పర్వాలేదనిపిస్తాయి. సామాజికాంశాల్ని బలంగా తెరపై చూపించి చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిన శంకర్, కొన్ని సీన్స్ తప్ప మిగతా వాటిని ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. నిర్మాణం పరంగా దిల్‌రాజు, శిరీష్ ఏ లోటూ చేయలేదు.
బలాలు
- + రామ్‌చరణ్ నటన
- + తమన్ సంగీతం
- + విజువల్స్
బలహీనతలు - - కాలం చెల్లిన కథ, కథనం
- - కొరవడిన భావోద్వేగాలు
- చివరిగా : ఈ 'గేమ్'ఇంకాస్త బాగా ఆడాల్సింది!
- గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!