Sixty Dog Bites in Every Hour in India : శునకం అంటే విశ్వాసానికి ప్రతీక అంటాం. అయితే ఇది ఒకప్పటి మాట అనే పరిస్థితులు వచ్చాయి. శునకం అంటే క్రూరత్వానికి ప్రతీక అని చెప్పుకునే దుస్థితి దాపురించింది. వీధి కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అలాగే ఉంది ఇప్పుడు. రోజూ ఏదో ఒక చోట వాటి దాడుల గురించి వినాల్సిన పరిస్థితి తలెత్తింది. లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. దేశంలో ప్రతి గంటకు 60మంది చిన్నారులు కుక్క దాడులకు గురవుతున్నట్లు లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ కథనం తెలిపింది. జంతువులు చేసే ప్రతి 4 దాడుల్లో 3 శునకాలవేనని వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరణాల సంఖ్యలో తక్కువ చెప్పినా కుక్కకాట్లు ఏటా 22లక్షల వరకు ఉంటున్నాయంది. మరి ఎందుకు ఈ పరిస్థితి? కుక్కల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? శునకాల దాడులను అరికట్టాలంటే ఏం చేయాలి?
వీధి కుక్కల వీరంగం : తోడేళ్ల మందలా సంచరిస్తాయి. ఆ ప్రాంతం తమదే అయినట్లు యథేచ్చగా తిరుగుతూ ఉంటాయి. అవి ఉన్న ప్రాంతం నుంచి నడవడమే తప్పు అయినట్లు దాడి చేస్తాయి. ద్విచక్ర వాహనం మీద ఉన్నాం అనే భరోసాతో ప్రయాణిస్తున్నా వెంబడిస్తాయి. ఇదీ దేశంలోని అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు సృష్టిస్తున్న వీరంగం. ప్రతి రోజూ వీటి దాడులు సాధారణంగా మారి పోయాయి. ముఖ్యంగా చిన్నారులు వీటికి ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. వారం క్రితం హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలికపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. 2030 నాటికి రేబిస్ రహిత దేశంగా అవతరించాలన్న భారత ప్రణాళికలు ఎంత గట్టిగా అమలు అవుతున్నాయో చెబుతున్న పరిణామాలు ఇవి.
ప్రతి గంటకు 60మంది చిన్నారుల దాడి : భారతదేశంలో కుక్కకాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో లాన్సెట్ ఇన్‌ఫెక్షస్ డిసీజ్ కథనంలో వివరించింది. దేశంలో జంతువులు జరిపే ప్రతి 4 దాడుల్లో 3కుక్కల వల్లనే అని తెలిపింది. కుక్క కాటుతో సంభవించే రేబిస్ వ్యాధి వల్ల ఏటా 5,700 మంది చనిపోతున్నట్లు వివరించింది. దేశంలో ప్రతి గంటకు 60మంది చిన్నారులు కుక్క దాడులకు గురవుతున్నట్లు తెలిపింది. కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కుక్క కాట్లకు సంబంధించి 2రోజుల క్రితం లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి. 2024లో దేశంలో 22లక్షల కుక్క కాటు కేసులు, 37 మరణాలు నమోదైనట్లు తెలపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందనే అభిప్రాయాలు కలవరపెడుతున్నాయి.
భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ కూడా కుక్క సహా జంతువుల దాడులు, మరణాలు, రేబిస్ నిరోధక వ్యాక్సినేషన్ గురించి 2022 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు సర్వే నిర్వహించింది. 15రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సర్వేలో సుమారు 79వేల ఇళ్లకు వెళ్లి 3 లక్షల మందికి పైగా ప్రశ్నించింది. ఇక్కడ కూడా జంతువులు చేసే ప్రతి 4 దాడుల్లో 3 కుక్కకాట్లు ఉన్నట్లు తేలింది. 2000 మంది జంతువుల దాడికి గురైనట్లు తెలపగా అందులో 1,576 మంది కుక్కకాటు బాధితులే. ఈ గణాంకాలు కూడా దేశంలో వీధి కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మేలు కోవాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు చాటి చెబుతున్నాయి.
9,000 మంది బాధితులు : తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే కుక్క కాట్లకు సంబంధించి గతంలో కలచివేసే అనేక ఘటనలు జరిగాయి. రెండేళ్ల క్రితం హైదరాబాద్ బాగ్ అంబర్ పేటలో శునకాల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోవడం అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో మంచంపై నిద్రిస్తున్న 16నెలల పసిపాపను గొంతుపట్టి ఈడ్చుకెళ్లి హతమార్చాయి. గతేడాది చిత్తూరులో ఓ పిచ్చికుక్క దాడిలో ఒకే రోజులో 41 మంది బాధితులుగా మారారు. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఇదే తరహా సంఘటనలు జరిగాయి. హైదరాబాద్‌లోనే గత ఏడాది తొలి మూడున్నర నెలలో 9,000 మందికి పైగా శునకాల గాట్లకు బాధితులయ్యారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇవి వీధుల్లో మందలు మందలుగా సంచరిస్తూ తరచూ దాడులు చేస్తున్నాయి.
రేబిస్ టీకాలు వేయించాలి : దేశంలో కుక్క సుమారు 2కోట్ల శునకాలు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఐసీఎంఆర్, దిల్లీ ఎయిమ్స్ గతంలో జరిపిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ఆ సంఖ్య అంతకు 3 రెట్లు ఎక్కువ ఉంటుందని ఇతర పరిశీలనలు చెబుతున్నాయి. శునకాల సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి కారణం వాటి జనాభాను అరికట్టే చర్యలు అంతంతమాత్రంగా ఉండడమే. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అధికారులు వీధి కుక్కలు అన్నింటికీ రేబిస్ టీకాలు వేయించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. అయితే కోర్టు ఆదేశాల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. భాగ్యనగరంలోని నాలుగు లక్షల శునకాల్లో గతేడాది నాటికి మూడోవంతు వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు జరగలేదని అంచనా.
సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు : కుక్కల బెడద చాలా వరకు జీవ వ్యర్థాలు, వృథా ఆహారం కాస్త ఎక్కువ లభించే నగరాలు, పట్టణాల్లో ఉంటుంది. ఇవి ఫంక్షన్ హాళ్లు, మార్కెట్‌లు, కబేళాల వద్ద లభిస్తాయి. అక్కడ కొరత ఏర్పడినపుడు శునకాలు జనావాసాల వైపు తరలివస్తున్నాయి. ఆ సమయంలో చేతిలో సంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. పెద్దవారైతే ఎంతో కొంత తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే చిన్నారులైతే తప్పించుకునే విచక్షణ వారికి ఉండదు. దీంతో ప్రతిఘటించలేక తీవ్రంగా గాయపడుతున్నారు. అది ఒక్కోసారి ప్రాణాలు పోయే దాకా వస్తోంది. అందువల్ల మాంసం, ఆహార పదార్థాలు ఇష్టారీతిన పడేయకుండా చూడాలి. వీటి ద్వారా కొంత మేర ఫలితం ఉంటుంది. సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలి.
వీధి కుక్కల బెడదపై ఆందోళన : కుక్కల దాడులు ఎండాకాలంలోనే ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. తీవ్ర వేడిమి, ఆహార కొరత వల్ల ఎండాకాలంలో కుక్కలు మరింత వెర్రెత్తిపోయి కనిపించిన వారిపై విరుచుకు పడతాయని పశు వైద్యాధికారులు వివరిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఉదాసీనత కూడా వీధి కుక్కల సంతతిని ఇబ్బడిముబ్బడి చేస్తూ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించేలా చేస్తోంది. వీధి కుక్కలను బంధించి సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపించడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లోకల్ సర్కిల్స్ స్వచ్ఛంద సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 79శాతం మంది ప్రజలు నివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదపై ఆందోళన వెలిబుచ్చారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ టీకాల కొరత వేధిస్తోంది. దీని వల్ల చాలా మంది బాధితులు నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే దేశీయంగా 2030 నాటికి రేబిస్‌ను నియంత్రించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించి, శునకాల సంతాన నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి.
భయపడుతున్న ఉద్యోగులు : వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలో ఉన్న సవాళ్లు కూడా అవి వేగంగా జరగకపోవడానికి కారణం అవుతున్నాయి. ఒక్కో శునకానికి శస్త్రచికిత్స చేయడానికి సుమారు 17వందల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వాలు మాత్రం నిధులు కేటాయించడం లేదు. పైగా కేటాయించిన కొన్ని ప్రాంతాల్లోనే అవి చేయాల్సి వస్తోంది. దీనికి తోడు శునకాలను బంధించడంలో జంతు హింస ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడాలి. తరలింపులో కుక్కలకు హాని జరిగితే తమ ఉద్యోగాలకు ఏ ప్రమాదం వస్తుందో అని ఉద్యోగులు భయపడుతున్నారు. ఇలా వివిధ కారణాలతో అధికార యంత్రాంగం సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు. అయితే గతంలో కామారెడ్డి జిల్లాలో అధికారులు కాస్త చొరవ తీసుకుని ఇలాంటి చికిత్సలపై నాలుగు నెలలు శిబిరం నిర్వహించారు. ఇలాంటి చొరవ అందరు అధికారుల్లో పెరిగితేనే కుక్క దాడుల నియంత్రణ సాధ్యం.
పునరావాస కేంద్రాలకు తరలించాలి : వేసవికి ఇంకా రెండు నెలలు ఉన్నా తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అదే సమయంలో కుక్క దాడుల గురించి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం కుక్కల కట్టడిపై ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి. వాటి సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉందో గుర్తించి పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరిపించాలి. విరివిగా రేబిస్ టీకాలను వేయించాలి. ఇందుకు ప్రభుత్వాలు కూడా విరివిగా నిధులు కేటాయించాలి. ప్రజలు పౌర సమాజం కూడా స్వీయ చర్యలు చేపట్టాలి. మాంసం, ఆహార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చూడాలి. కుక్కలు ఉండే చోట నుంచి చిన్నారులు వెళ్లాల్సి వస్తే తప్పకుండా పెద్దలు తోడుగా ఉండాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటేనే కుక్కల దాడిని అరికట్టేందుకు వీలు కల్గుతుంది.