Digital Lock For Security : సాధారణంగా మనం ఏదైనా ఊరెళితే తిరిగి వచ్చే వరకు భయం. ఇంట్లో విలువైన వస్తువులుంటే ఎక్కడ దొంగలు పడతారోనన్న ఆందోళన కూడా ఉంటుంది. ఇంటి పక్కన ఉండే వారికి చెప్పి వెళ్లాలి. లేదంటే పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. ఇది ఒకప్పటి మాట కానీ ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డిజిటల్ తాళాలు ఇంటిని భద్రంగా, జాగ్రత్తగా ఉంచుతాయి.
ఎవరైనా వచ్చి తాళం తెరిచే ప్రయత్నం చేస్తే పెద్ద శబ్దంతో అలారం మోగుతుంది. సెన్సార్ ఆధారంగా నేరుగా ఇంటి యజమానికే సమాచారం అందించే పరికరాలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడంటే వెంటనే శబ్ధం చేసే ఆలారాలు, వైర్లను కత్తిరిస్తే తెలిపే ట్యాంపర్ ప్రూఫ్, డిటెక్టర్ ఇలా ఎన్నో రకరకాల ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంటికి భద్రత కల్పిస్తున్నాయి.
అప్రమత్తం చేసేలా : మార్కెట్‌లో రూ.1500 నుంచి మొదలుకొని రూ.10 వేల వరకు అలారం తాళం లభిస్తుంది. కొత్తగా ఎవరైనా వ్యక్తులు తాళాన్ని తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే పెద్ద శబ్దంతో అలర్ట్ చేస్తుంది. ఈ సమాచారం ఇంటి యజమానితో పాటు పోలీసులకు కూడా చేరుతుంది. అలారం మోగడం కోసం ఇంట్లో కంట్రోల్ ప్యానల్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనిని తలుపులు, కిటికీలకు కనెెక్ట్ చేసుకోవాలి. సెన్సార్ల ద్వారా అమర్చిన డిజిటల్ తాళాన్ని ఎవరైనా తెరిచేందుకు ప్రయత్నించినా, తలుపులు, కిటికీలను బద్దలు కొట్టడానికి యత్నించినా పెద్ద శబ్దాలు రావడంతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్‌కు, పోలీసులకు సమాచారం వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఈ టెక్నాలజీలో ఇమిడి ఉంటుంది.
ఇంటి లోపలి నుంచే గుర్తించేలా : కొత్తగా లభించే వీడియో డోర్ ఫోన్‌తో ఇంటి ముందు ఎవరున్నారన్నారని తెలుసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. వైర్‌లెస్, బ్యాటరీతో పనిచేసే మోడ్రన్ కాలింగ్‌బెల్ ఇది. దీనికి రెండు పరికరాలుంటాయి. కాలింగ్ బటన్, స్పీకర్ ఉన్న యూనిట్‌ను ఇంటి బయట అమర్చాలి. స్క్రీన్‌తో కూడిన రెండో పరికరాన్ని ఇంటి లోపల ఉంచాలి. బయట ఎవరైనా తెలియని వ్యక్తులు ఉంటే ఈ విషయాన్ని మనం ఇంట్లో నుంచే గుర్తించే వీలుంది. తెలిసిన వ్యక్తులు వస్తే తలుపులు తెరిచి లోపలికి, లేకుంటే తలుపు తెరవకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
గత ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి, పగటిపూట తాళాలు పగులగొట్టి సొత్తు చోరీ చేసిన ఘటనలు 597 నమోదయ్యాయి. దొంగలు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును చోరీ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 41 చోరీల కేసులు నమోదయ్యాయి. పగలంతా రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగులగొట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.
పెరుగుతున్న అవగాహన : చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు డిజిటల్ తాళాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి భద్రత కోసం ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న డిజిటల్ తాళాలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
వాహనాలకు సైతం : జీపీఎస్(గ్లోబల్ పోజిషనింగ్ సిస్టం) ఆధారంగా పనిచేసే ట్రాకింగ్ కిట్‌తో వాహనాల కలికలను గుర్తించవచ్చు. ఈ కిట్‌ను కమ్యూనికేటర్‌కు కనెక్ట్ చేసి వాహనానికి అమరుస్తారు. వాహనం లోపలి భాగంలో దీనిని కనిపించకుండా అమర్చి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేసుకోవచ్చు. వాహనం చోరీకి గురైతే జీపీఎస్ ద్వారా అది ఏ ప్రాంతంలో ఉందో సులువుగా గుర్తించే వీలుంది.
ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా? - తస్మాత్ జాగ్రత్త - ఇవి పాటించడం ఉత్తమం!
'సిటీలో కొట్టేస్తారు, ఊళ్లలో అమ్మేస్తున్నారు - చౌకగా వస్తుందని కొన్నారో బుక్కైపోతారు!