Vighnahar Temple At Ozar Significance : మహారాష్ట్రలో అష్ట వినాయక క్షేత్రాలలో ఏడో క్షేత్రంగా విఘ్నహార్ వినాయక క్షేత్రం భాసిల్లుతోంది. ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున వెలసిన విఘ్నహార్ వినాయక క్షేత్రంలో వినాయకుడు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ స్థలపురాణం గురించి తెలుసుకుందాం.
ఆలయ స్థల పురాణం
పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూ ఉండేవాడు. రాక్షసుని ఆగడాలను భరించలేక మునులంతా వినాయకుని ప్రార్థించారు. రాక్షసుని బారి నుంచి మునులను కాపాడుట కోసం వినాయకుడు విఘ్నాసురునితో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. అలా ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు.
వినాయకుని శరణు కోరిన విఘ్నాసురుడు
ఎంతోకాలంగా యుద్ధం చేసి అలిసిపోయిన తర్వాత ఇక వినాయకుని గెలవడం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణు కోరి, వినాయకుడు తన పేరు మీద ఇక్కడే కొలువు తీరాలని వేడుకున్నాడు. శరణు కోరిన రాక్షసుని కోరిక మేరకు వినాయకుడు అక్కడే కొలువయ్యాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయక్ అని అంటారు.