Venkateswara Swamy 7 Saturday Vratham Benefits : జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచి పెట్టి ఇంకో వారం చేయవచ్చు. ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే! పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాలపాటు చేయాల్సి ఉంటుంది.
ఏడు శనివారాల వ్రత పూజా విధానం
శనివారం తెల్లవారుజామునే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ, విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి.
వడ్డికాసులవానికి ముడుపుల మూట
వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి.
పిండి దీపాలు
ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందురోజు రాత్రి పావుశేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటిరోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో, కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి.
ఏడు కొండలవాడికి ఏడు ఒత్తుల దీపం
Venkateswara Swamy Pooja Vidhanam : పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి, ఆవు నేతితో వేంకటేశ్వరస్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవింద నామాలు చదువుకోవాలి. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి, శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి, నీరాజనాలు ఇవ్వాలి.