Hanuman Picture At Home :శ్రీరామభక్త హనుమాన్ చిత్రపటం దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అయితే హనుమంతుని పూజించేందుకు కొన్ని నియమాలున్నట్లే హనుమ ఫోటో ఇంట్లో పెట్టుకోడానికి కూడా కొన్ని నియమాలు పాటించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి మీ ఇంట్లో ఆంజనేయస్వామి పటం ఇప్పటికే ఉన్నా సరే, ఇకముందు పెట్టుకోవాలన్నా వాస్తు ప్రకారం ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.
హనుమంతుని పూజకు నియమాలు
తులసీదాస్ రచించిన రామచరిత మానస్ ప్రకారం శ్రీరామునికి దాసానుదాసుడైన హనుమయ్య ఆరాధననకు మంగళవారం శ్రేష్టమైనది. ధైర్యం, శక్తికి ప్రతీకగా భావించే ఆంజనేయస్వామిని ఆరాధించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. హనుమంతుడికి పూజిచేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారో వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతారు.
దేవుని పటాలకు కూడా వాస్తు అవసరమే!
దాదాపుగా మనందరి ఇళ్లల్లో పూజగది ఉంటుంది. పూజగదిలో దేవుని పటాలు ఎలా పడితే అలా కాకుండా ఓ పద్దతిలో అమర్చుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. బంధువులు, మిత్రులు ఇచ్చారని దేవుని గది అంతా పటాలతో నింపేయకూడదు. ఒక క్రమ పద్దతిలో అమర్చుకుంటేనే చూసేందుకు బాగుంటుంది. ఎవరైనా దేవుని గదిలోకి ప్రశాంతత కోసమే వెళ్తారు. మరి అలాంటప్పుడు దేవుని మందిరం గజిబిజిగా ఉంటే మనశ్శాంతి సంగతి దేవుడెరుగు ప్రతికూల ఆలోచనలు ఎక్కువైపోతాయి.
ప్రతికూల శక్తులు తొలగించే హనుమ
ఇంట్లోని ప్రతికూల శక్తులు బయటకు పోయి సమస్యలు లేని సుఖమయ జీవితానికి వాస్తు ప్రకారం హనుమంతుని ఫోటోను దక్షిణ దిశలోనే ఉంచాలి. అది కూడా హనుమ కూర్చున్న భంగిమలో, ఎరుపు రంగులో ఉండే ఫోటోనే ఉంచాలి. ఎందుకంటే హనుమంతుని ప్రభావం దక్షిణ దిశలోనే అధికంగా ఉంటుందని పండితులు చెబుతారు. ఈ దిశలో హనుమంతుని ఫోటో పెట్టడం వల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఐశ్వర్యకారకం ఉత్తరాభిముఖం
హనుమంతుని పటాన్ని ఉత్తరాభిముఖంగా ఉంచితే లక్ష్మీకటాక్షం కలిగి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
శత్రుబాధలు తొలగించే పంచముఖి హనుమ
పంచముఖి హనుమాన్ విగ్రహం, చిత్రపటం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు, శత్రుభయం తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం పంచముఖి హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లోని ప్రధాన ద్వారం పైన ఉంచితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు.