Undrala Tadiya Vratam : దక్షిణాయన పుణ్యకాలంలో స్త్రీలు అనేక వ్రతాలు, నోములు, పూజలు చేస్తుంటారు. వీటిలో స్త్రీలు విశేషంగా చేసుకునే ఉండ్రాళ్ల తదియ వ్రతం గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పిన నోము!
ఉండ్రాళ్ల తదియ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని భవిష్యపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఉండ్రాళ్ల తదియ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉంది.
ఉండ్రాళ్ల తదియ ఎప్పుడు చేస్తారు?
భాద్రపద బహుళ తదియ రోజు ఉండ్రాళ్ల తదియ జరుపుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అంటే శుక్రవారం రోజున భాద్రపద బహుళ తదియ కావున ఆ రోజునే ఈ వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
ఉండ్రాళ్లతదియ అని ఎందుకు అంటారు?
తదియ రోజున చేసే నోము అందునా ప్రత్యేకంగా ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావటంచే ఈ వ్రతానికి ఉండ్రాళ్ల తదియ అని పేరు వచ్చింది. ఉండ్రాళ్ల తదియ జరుపుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన గాథ ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజు - ఏడుగురు భార్యలు
పూర్వం ఓ రాజుగారికి ఏడుగురు భార్యలు ఉండేవారు. ఏడు మంది భార్యలున్నా ఆ రాజు గారికి మాత్రం ఓ వేశ్యయైన 'చిత్రాంగి'పై మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ల తదియ నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి, రాజుగారితో "నీవు వివాహం చేసుకున్న భార్యలందరూ ఉండ్రాళ్ళ తదియ నోము నోచుకుంటున్నారు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తదియ నోము జరుపుకోవటానికి అవసరమైన సరకులను సమకూర్చమని" రాజును అడిగింది. అందుకు అంగీకరించిన రాజు చిత్రాంగి నోము నోచుకోడానికి అవసరమైన సరుకులను పంపిస్తాడు.
ఉండ్రాళ్లతదియ నోము నోచుకున్న చిత్రాంగి
చిత్రాంగి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయం వరకు ఏమీ భుజింపక ఉపవాస దీక్ష ఉండి, చీకటి పడగానే గౌరీ దేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి, ఐదు ఉండ్రాళ్ళు గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టి, మరో అయిదు ఉండ్రాళ్లు ఒక పుణ్య స్త్రీకి వాయనమిచ్చి, నోము ఆచరించి గౌరీ దేవి అనుగ్రహాన్ని పొందింది.
చిత్రాంగికి సద్గతులు
చిత్రాంగి ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా ఉండ్రాళ్ల తదియ నోము నోచుకుని, ఉద్యాపన చేసిన ఫలితంగా ఒక వేశ్య అయినప్పటికిని ఆమె పుణ్య స్త్రీలు పొందే సద్గతిని పొందింది.
ఉండ్రాళ్ల తదియ పూజా విధానం
ఉండ్రాళ్ల తదియ వ్రతం చేసుకునే వారు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి. ఆ తరువాత ఈ రోజు ఉండ్రాళ్ల తదియ వ్రతం చేస్తానని, రోజంతా ఉపవాసం ఉంటానని గౌరీ దేవి సమక్షంలో దీక్ష తీసుకోవాలి. సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, బియ్యం పిండితో ఉండ్రాళ్లు తయారు చేసుకోవాలి. గౌరీ దేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి, ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నివేదించాలి.
ముత్తైదువులకు వాయనం
పూజ పూర్తయ్యాక చీర, రవికెలతో పాటు ఐదు ఉండ్రాళ్లు ఉంచిన వాయనముపై దక్షిణ తాంబూలాలు ఉంచి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఈ ఉండ్రాళ్ల తదియ నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికి పాదాలకు పసుపు, పారాణి రాసి నమస్కరించి, వారి ఆశీస్సులు పొంది, అక్షతలను వేయించుకోవాలి.
ఉండ్రాళ్లతదియ వ్రతఫలం
ఈ ఉండ్రాళ్ల తదియ నోము ముఖ్యంగా పెళ్ళి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారని, మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. అలాగే వివాహితులు ఈ నోమును ఆచరించడం వలన ఉత్తమగతులు పొందుతారు.ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.