Akshaya Navami Usirika Pooja : వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తిక శుద్ధ నవమి రోజు అక్షయ నవమిగా జరుపుకోవాలని తెలుస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ ఆదివారం నాడు ఈ పండుగను జరుపుకోనున్న సందర్భంగా అసలు అక్షయ నవమి అంటే ఏమిటి? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.
అక్షయ నవమి అంటే!
అక్షయం అంటే 'క్షయం' లేనిది అంటే నశింపనిది అని అర్థం. పురాణాల ప్రకారం కార్తీక శుద్ధ నవమి రోజునే సత్యయుగం ముగిసి, త్రేతాయుగం కూడా ప్రారంభమైందని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున అమల నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు చేకూరుతాయని, సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. ఇక ఈ రోజు ఎలాంటి పూజ చేయాలో చూద్దాం.
ఉసిరిక చెట్టు పూజ
అక్షయ నవమి రోజు శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
అక్షయ నవమి పూజకు శుభ ముహూర్తం
ఈ ఏడాది నవంబర్ 9, 2024 శనివారం రాత్రి 10:45 గంటలకు నవమి తిథి ప్రారంభమై, మరుసటి రోజు 10 నవంబర్ 2024 ఆదివారం రాత్రి 9:01 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఆదివారం రోజున అక్షయ నవమి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
అక్షయ నవమి పూజా విధానం
అక్షయ నవమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి శుచియై, నిత్య పూజాదికాలు పూర్తి చేసుకొని, ఈ రోజు ఉపవాసం ఉంటానని భగవంతుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి. అక్షయ నవమి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 'శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
ఉసిరిక చెట్టు పూజ
అక్షయ నవమి రోజు ఉసిరిక చెట్టును విశేషంగా పూజిస్తారు. ముందుగా ఉసిరి చెట్టు మొదలులో గంగాజలాన్ని సమర్పించాలి. అనంతరం ఉసిరిక చెట్టును గంధ పూస్ఫాక్షతలతో, పసుపు కుంకుమలతో పూజించాలి. ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ‘ఓం ధాత్యే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉసిరిక చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి.
ఇవి సమర్పించాలి
అక్షయ నవమి రోజు ఉపవాసం ఉండి శ్రీ హరిని పూజించి, జామకాయను నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయంలో జామకాయలను దానం చేయాలి. అలాగే బ్రాహ్మణులతో, బంధు మిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు కింద కానీ, జామ చెట్టు కింద కానీ భోజనాలు చేయాలి.
ఈ దానాలు శ్రేష్ఠం
అక్షయ నవమి రోజు పితృదేవతల ప్రీతి కోసం ఉన్ని బట్టలు, దుప్పట్లను దానం చేయాలి. సద్బ్రాహ్మణులకు వస్త్ర దానం, దీప దానం, సాలగ్రామ దానం చేయాలి.
ఈ రోజు ఇవి కొంటే శ్రేష్ఠం
దీపావళి రోజున బంగారం, వెండి ఇతర విలువైన వస్తువులు కొనలేని వారు ఈ రోజు కొనుగోలు చేస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.
వృక్షో రక్షతి రక్షితః
అక్షయ నవమి రోజు ఇంటి ఆవరణలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ ఉసిరి మొక్కలను నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో ఈ ఉసిరి చెట్టును నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఒకవేళ ఉత్తర దిశలో సాధ్యం కాకపోతే, తూర్పు దిశలో కూడా ఉసిరి చెట్లను నాటొచ్చు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇంట్లో పాజిటివ్ శక్తి పెరిగి, కష్టాలన్నీ తొలగిపోతాయని పెద్దలు అంటారు.
రానున్న అక్షయ నవమి రోజు మనం కూడా ఉసిరిక చెట్టును పూజిద్దాం సకల సౌభాగ్యాలను పొందుదాం.
జై శ్రీమన్నారాయణ!
గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.