SC on Bulldozer justice : ఇళ్లు, ఆస్తుల ధ్వంసం పేరుతో పౌరుల గొంతు అణచివేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. రూల్ ఆఫ్ లా ప్రకారం బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే ఆర్టికల్ 300A ప్రకారం ఆస్తి హక్కు ప్రమాదంలో పడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడానికి రాష్ట్రాలు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు.
ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయి. వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. అందుకు అనుమతిచ్చిన అధికారులపైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఇలాంటి చర్యలు చేపట్టడంలో తప్పు లేదు. వీటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి. ఆక్రమణలపై చర్యలు తీసుకోవడానికి మున్సిపల్, పట్టణ ప్రణాళిక చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి.' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
2019లో రోడ్డు విస్తరణలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులను ఇవ్వకుండా కూల్చడం వల్ల తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈనెల 6న తీర్పు ఇవ్వగా శనివారం పూర్తిస్థాయి కాపీని అధికారులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. బాధితుడికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేస్తూ, అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది. అయితే, రహదారులు, ఫుట్‌పాత్‌ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపునిచ్చింది.