Telangana Samagra Kutumba Survey : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రెండో దశ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిన్న(శనివారం) మందకొడిగా ప్రారంభమైంది. 29 లక్షల ఇళ్లకు గాను తొలి దశలో మూడు రోజుల నుంచి 22 లక్షలకుపైగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టిక్కరింగ్ పూర్తి కాకపోవడం, సిబ్బంది ఓటరు నమోదు కార్యక్రమంలో ఉండటంతో మధ్యాహ్నం తర్వాత సర్వే మొదలుపెట్టారు. అయితే చాలా సర్కిళ్లలోని ఎన్యుమరేటర్లకు సర్వే ఫారాలు అందలేదు. కేటాయించిన 150 ఇళ్లను పూర్తి చేసిన వారికే సర్వే ఫారాలు ఇస్తున్నారని పలువురు ఎన్యుమరేటర్లు తెలిపారు. మరోవైపు స్టిక్కర్లు అతికించే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దుర్భాషలాడుతూ సర్వేకు సహకరించడం లేదని పలువురు ఎన్యుమరేటర్లు వాపోయారు.
కుటుంబ వివరాలు ఇచ్చిన గవర్నర్ : సర్వే విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు అందజేశారు. సర్వేకు ప్రజలు సహకరించాలని పొన్నం పిలుపు నిచ్చారు. సర్వే చేస్తున్న తీరును కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సర్వేలో తన కుటుంబ వివరాలు తెలిపారు.
ఎన్యుమరేటర్లకు తప్పని ఇబ్బందులు : ప్రజలందరూ పూర్తి వివరాలను తమ సిబ్బందికి అందజేయాలని జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్, లీగల్ విభాగ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి వార్డు ఆఫీస్ నుంచి ఆయన సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు ప్రజల నుంచి వివరాలు సేకరించగా మరికొన్నిచోట్ల ఇంటింటికి స్టిక్కరింగ్ ప్రక్రియ జరిగింది. అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు ఇళ్లల్లోకి రానివ్వడం లేదని కొంతమంది ఎన్యుమరేటర్లు, జీహెచ్ఎంసి సిబ్బంది చెబుతున్నారు.
"నిన్న ఒకరి ఇంటికి వెళితే వారు ఈ సర్వే మాలాంటి వారికి కాదు. మేము రిచ్ పీపుల్. ఈ సర్వే మీలాంటి వారిదని చెప్పి పంపించేశారు. ముఖం మీదనే గేటు వేశారు. స్టిక్కర్ అతికిస్తామంటే చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టి వెళ్లమన్నారు. కొంతమంది తిట్టేవారు. మేము సర్వే కోసం వెళితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఐడీ కార్డును లాగేసుకొని, మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించేవారు. మీకు మేము ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు." - ఎన్యుమరేటర్లు
జిల్లాల్లో కొనసాగుతున్న సమగ్ర సర్వే : నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. సర్వేపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వివరాల సేకరణ కాస్త ఆలస్యమవుతోంది. సర్వేపై అనుమానాలు ఉంటే అధికారులతో నివృత్తి చేసుకోవచ్చని ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో జరుగుతున్న సర్వే తీరును స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ములుగు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో పర్యటించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను ఆయన పర్యవేక్షించారు.
ప్రధాని అలా మాట్లాడటం హాస్యాస్పదం : కులగణనతో కుటుంబానికి సంబంధించిన గోప్యత ఉండదని విపక్షాలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగరంలోని పలు డివిజన్లలో ఆయన కులగణన సర్వేను పరిశీలించారు. కొన్ని పార్టీలు కావాలనే సర్వేపై రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సమాజాన్ని కులాల వారీగా విభజిస్తున్నారనే మాటలు ప్రధాని అనడం హాస్యాస్పదమని కడియం పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని మోడల్ కాలనీలో సమగ్ర సర్వేను ఎమ్మెల్యే పరిశీలించారు.
'మా పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు' : ఎన్యూమరేటర్లు ఇళ్లల్లోకి రాకుండా దుర్భాషలు
నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే - ఇల్లొదిలి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఇలా చేస్తే సరిపోతుంది