Karthika Puranam 9th Day In Telugu : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో నిత్య పారాయణంగా చెప్పుకుంటున్న కార్తిక పురాణంలో 'నారాయణ' నామస్మరణ మహత్యం గురించి వివరించిన వశిష్ఠుడు, అజామిళుని కోసం వచ్చిన విష్ణుదూతలు, యమదూతల మధ్యన జరిగిన సంభాషణను వివరిస్తూ చెప్పిన తొమ్మిదో రోజు కథను ఈ కథనంలో తెలుసుకుందాం.
విష్ణుదూతలు యమదూతల సంవాదం
అజామిళుని కోసం వచ్చిన విష్ణుదూతలు, యమ దూతలతో "ఓ యమదూతలారా! మేము విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను" అని ప్రశ్నించిరి. అందుకు యమదూతలు సమాధానమిస్తూ "ఓ విష్ణుదూతలారా! మానవుడు చేయు సకల పాప పుణ్యాలను పంచభూతాలు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు దగ్గరకు వచ్చి వాటిని తెలియచేస్తూ ఉంటారు. మా ప్రభువులవారు వీటన్నిటిని చిత్రగుప్తునిచే లెక్కించి ఆ మనుజుని మరణ కాలమున మమ్ము పంపి వారిని ఇక్కడకి రప్పిస్తారు. వాస్తవముగా పాపులెటువంటి వారో, ఏయే పాపములు చేసినవారు పాపులగుదురో వినుము"అని అంటూ నరక దూతలు విష్ణు దూతలకు చెప్పసాగిరి.
పాపాత్ములు - ఘోరపాపాలు
సదాచారములను విడిచి పెట్టి వేదశాస్త్రములు నిందించువాడు, గోహత్య, బ్రహ్మహత్యాది మహా పాపములు చేసినవారు, పరస్త్రీలను కామించేవారు, తల్లిదండ్రులను, గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు, జారత్వము, చోరత్వంచే భ్రష్టులైనవారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారు, శిశుహత్య చేయువారు, శరణన్నవారిని కూడా వదలకుండా బాధించువారును, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరగనీయకుండా అడ్డుతగిలే వారును పాపాత్ముల కోవలోకి వస్తారు. అటువంటి పాపాత్ములు మరణించగానే తన వద్దకు తీసుకుని వచ్చి నరకము నందు పడద్రోసి శిక్షించవలసిందిగా మా యమ ధర్మరాజుగారి ఆజ్ఞ.
అజామిళునికి ఇందుకే వైకుంఠవాసం
ఈ అజామిళుడు బ్రాహ్మణుడై ఉండి కూడా కులభ్రష్టుడై జీవహింసలు చేసి, కామాంధుడై వావివరుసలు తెలీక సంచరించిన పాపాత్ముడు, వీరిని మీరు విష్ణు లోకమునకు ఎలా తీసుకుని వెళ్తున్నారు"అని నరక దూతలు అడుగగా అప్పుడు విష్ణుదూతలు "ఓ యమ కింకరులారా! మీరు అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. సజ్జనులతో సహవాసం చేయు వాడు, జప,దానధర్మములు చేయువాడు, అన్న దానము, కన్యా దానము, గోదానము, సాలగ్రామము దానం చేయువాడు, అనాధ ప్రేత సంస్కారం చేయువాడు, మరణకాలమునందు "హరీ" అని శ్రీహరిని, "శివా" అని ఈశ్వరుని స్మరించినవారును పుణ్యాత్ములు. ఈ అజామిళుడు తెలిసికాని,తెలియకగాని, "నారాయణా" అని స్మరిస్తూ మరణించాడు. అందుకే మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకునివెళ్తున్నాము." అని పలికిరి.
అజామిళుని సంభ్రమం
యమదూతలు, విష్ణుదూతలు సంభాషణను విన్న అజామిళుడు ఆశ్చర్యముతో "ఓ విష్ణు దూతలారా! పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్క రోజు కూడా నేను నారాయణ పూజ చేయలేదు. పైగా బ్రాహ్మణత్వం వీడి కులభ్రష్టుడనై నీచ కులకాంతలతో సంసారం చేసితిని. చిట్టచివరకు నా కుమారునిపై గల ప్రేమతో "నారాయణ" శబ్దమును పలికినందుకు నాకు వైకుంఠప్రాప్తి కలిగింది. ఆహా! నేనేంతటి అదృష్టవంతుడను. నా పూర్వజన్మ సుకృతము,నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది" అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున "ఓ! జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని కార్తిక మాసంలో నారాయణ నామం జపించిన యెడల సకల పాపములు నశించుటయేగాక మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికీ నిజం." అని చెబుతూ వశిష్ఠులవారు తొమ్మిదవరోజు కథను ముగించాడు. ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే నవమాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.