Ujjain Mahankali Bonalu :తెలంగాణాలో ఆషాడంలో జరిగే అతిపెద్ద జాతర, తెలంగాణా రాష్ట్ర పండుగ అయిన బోనాలు శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఈ సందర్భంగా ఈ వారం బోనాల జాతర జరగనున్న సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో జాతర విశేషాలు తెలుసుకుందాం.
పుట్టింటికి చేరే అమ్మవారు
ఆషాడమాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్లడం మన సంప్రదాయం కదా! అలాగే నిత్య పెళ్లి కూతురు అయిన అమ్మవారు ప్రతి ఆషాడంలో తన పుట్టింటికి వెళుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాల పేరిట ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
అసలేమిటీ బోనాలు?
భోజనం అనే పదానికి వికృతి పదమే బోనం. బోనాలు అంటే భోజనం సమర్పించడం. ముఖ్యంగా ఈ పండుగ గ్రామ దేవతలకు సంబంధించినది కావడం వలన ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వెలసిన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ తల్లి ఇలా రకరకాల పేర్లతో ఉన్న గ్రామ దేవతలను పూజించి బోనాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు.
బోనం ఇలా తయారుచేస్తారు?
అమ్మవారికి సమర్పించే బోనంలో మహిళలు మట్టికుండలో పొంగళ్లు కానీ, వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్లు, ఆటగాళ్లు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపాన్ని ఉంచి భక్తిశ్రద్ధలతో అమ్మకు సమర్పిస్తారు.
తెలంగాణా రాష్ట్ర పండుగ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వారు భాగ్యనగరంలోని కాకుండా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది.
మహంకాళి అమ్మవారి జాతర
ఈ ఆదివారం సికింద్రాబాద్లో వెలసిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరగనుంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ల క్రితం నాటిదని స్థానికుల నమ్మకం. ఈ గుడిలో శక్తికి, అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు.
అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు
నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక బోనాల పండుగ రెండు రోజులు ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. లష్కర్ బోనాలుగా పిలవబడే ఈ సికింద్రాబాద్ జాతరను చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
ఆలయ విశేషాలు - స్థల పురాణం
ఉజ్జయిని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైనది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా ఆయనను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉజ్జయినిలో కలరా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడి, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ మొక్కుకున్నారంట.
తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడే ఆ అమ్మవారు కరుణ వలన కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అంతట అమ్మవారి కరుణ వల్లనే ఇదంతా జరిగిందని విశ్వసించిన సురటి అప్పయ్య, ఆయన మిత్రులు 1815లో ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి, ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు.
ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడిన బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భాగ్యనగరానికి తలమానికంగా నిలిచింది. అమ్మవారి ఆలయం ఎప్పుడు భక్తులతో సందడిగా ఉంటుంది.