Tulasi plant Vastu direction: హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా తులసి మొక్క ఏ వైపు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో తులసి ఉంటే విశిష్ట ప్రభావం
ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. తులసి మొక్కని పెరటి గుమ్మం ఎదురుగా అంటే ఒకప్పుడు ఇంట్లో గదులన్నీ నేరుగా ఉండే రోజుల్లో వాకిట్లో నుంచి చుస్తే పెరట్లోని తులసి మొక్క కనబడేది. అలా ఇల్లు ఉన్నవాళ్లు చక్కగా ఆ రకంగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ సంస్కృతి ఉంది. మరి అపార్టుమెంట్లలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇంటికి బాల్కనీ ఎటువైపు ఉంటే ఆ ప్రదేశంలో వాయువ్యం వైపుగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. లేకుంటే ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.
తులసి పూజ ఎవరు చేయాలి
ఇంటి ఇల్లాలు ప్రతి నిత్యం స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంటి యజమాని సూర్యోపాసన తర్వాత తులసి మొక్కకు నీరు పోయాలని వాస్తు శాస్త్రంలో చెప్పారు. శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు. ప్రతి రోజు విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు, ఉన్నత పదవులు దక్కుతాయి. మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ, కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలి. అయితే మంగళ శుక్రవారాల్లో తులసి దళాలు కోయకూడదు. మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించవచ్చు.
తులసి మొక్కను ఎలా కాపాడాలి
తులసి మొక్కకు ఉండే వెన్నును (తులసి మొక్క పైన ఉండే విత్తనాలు)క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి. అప్పుడే తులసి మొక్క చక్కగా నిటారుగా పెరుగుతుంది. కొంతమంది తులసి మొక్క వెన్ను ఎక్కువగా పెరిగితే ఇంటి ఇల్లాలు తలనొప్పితో బాధపడుతుందని అంటారు. అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారమేది లేదు.