TTD Udayasthamana Seva Details: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కనులారా చూసి తరించేందుకు ఎన్నో రకాల ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులో ఉంచుతోంది. ఒక్క నిమిషం చూసినా చాలని తపించే ఆ వెంకన్న దర్శనాన్ని.. ఓ రోజంతా కల్పిస్తోంది ఒక ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. కోటిరూపాయలకు పైగా విలువచేసే ఈ సేవను దక్కించుకుంటే జన్మధన్యమైనట్టే! జీవితాంతం ఏడాదికోసారి స్వామిని తనివితీరా కొలవచ్చు. మరి ఈ సేవ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
తిరుపతికి వెళ్లాలనే ఆలోచన రాగానే వెంటనే టీటీడీ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రత్యేక దర్శనానికి టికెట్లు ఉన్నాయో లేవో చూసుకుంటాం. సర్వదర్శనం, దివ్య దర్శనాలతోపాటు నిత్య, వార పూజలు, ప్రత్యేక సేవలు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిలో ఎంతో విశేషమైనది ఉదయాస్తమాన సేవ.
వైఖానస ఆగమం ప్రకారం నిత్యం శ్రీహరికి ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ వరకూ జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఒక్కో సేవలో పాల్గొనేలా విడివిడిగా టికెట్లూ ఉన్నాయి. అవి కాకుండా ప్రత్యేకంగా "‘కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే" అంటూ స్వామి సుప్రభాత సేవలో పాలు పంచుకుని, రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీనివాసుడి సకల వైభోగాలనూ తిలకించే భాగ్యాన్ని ఉదయాస్తమాన సర్వసేవ(యూఎస్‌ఎస్‌ఈఎస్ - USSES) రూపంలో టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా?
ఎలా ఇస్తారు:తొలిసారిగా 1980ల్లో మొదలుపెట్టిన ఈ సేవా టికెట్లకు పోటీ ఎక్కువగా ఉండటంతో మధ్యలో నిలిపేశారు. ఆ తర్వాత మళ్లీ 2021లో టీటీడీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.కోటి ఆ పైన విరాళాలు అందించే భక్తులకు ఈ ఉదయాస్తమానసేవా టికెట్లను కేటాయిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఆరు రోజులూ ఈ సేవా టికెట్ల ధర రూ.కోటి ఉంటే శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలు. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో శుక్రవారానికి సంబంధించిన అన్ని టికెట్లనూ భక్తులు ఇప్పటికే బుక్ చేసుకున్నారు.