TTD Cancels Arjita Sevas Due to Brahmotsavam : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామివారికి మొక్కులు, ముడుపులు చెల్లించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల టైమ్లో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. మరి మీరు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఈ విషయం తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఉత్సవాల సమయంలో 10 రోజులపాటు పలు సేవల్ని రద్దు చేస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్రహ్మోత్సవాలకు వేళాయే..తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే బ్రహ్మోత్సవాల సందర్భంగా.. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఏ ఏ సేవలు రద్దు కానున్నాయంటే?
అక్టోబరు 3న అంకురార్పణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రారంభంకానున్నాయి. ఈ నెల 12న చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఈ నెల 3(నేటి) నుంచి 12వ తేదీ వరకు అంటే.. 10 రోజుల పాటు వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే.. వీఐపీ బ్రేక్ దర్శనాలనూ ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు పేర్కొంది.