తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

గజవాహనంపై పద్మావతమ్మ విహారం- ఒక్కసారి దర్శిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం! - TIRUCHANUR BRAHMOTSAVAM 2024

తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు - ఐదో రోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో గజవాహనంపై పద్మావతి అమ్మవారు విహారం

Tiruchanur Brahmotsavam
Tiruchanur Brahmotsavam (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 3:26 PM IST

Tiruchanur Brahmotsavam Day 5 :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు అమ్మవారికి ఏ ఉత్సవాలు జరుగనున్నాయి? అమ్మవారు ఏ వాహనంపై ఊరేగనున్నారు అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

పల్లకీ ఉత్సవం - వ‌సంతోత్స‌వం - గజ వాహనసేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు డిసెంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు పల్లకీ ఉత్సవం, వ‌సంతోత్స‌వం జరుగుతాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహనంపై అమ్మవారు తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

పల్లకి ఉత్సవం విశిష్టత
కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవం జరుగుతుంది. పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలు మంగ‌ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మంగళ వాద్యాలు, డప్పు ప్రదర్శనలు, భక్తుల కోలాటాల మధ్య అమ్మవారు తిరు మాడ వీధులలో పల్లకిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అమ్మవారి పల్లకీ ఉత్సవం కనులారా చూసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని శాస్త్ర వచనం.

వసంతోత్సవం విశిష్టత
పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు వసంత మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పసుపు, గంధం, పన్నీరు, ఎర్రచందనం, కస్తూరి, పచ్చ కరుపురం వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో అమ్మవారికి అభిషేకం జరిపించే కార్యక్రమాన్ని వసంతోత్సవం అంటారు. అమ్మవారి ఈ వసంతోత్సవం వేడుకను కళ్లారా చూసిన వారికి కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తాయని శాస్త్రవచనం.

గజ వాహన సేవ విశిష్టత
బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు డిసెంబర్ 2న సోమవారం సాయంత్రం అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఐశ్వర్య కారకం గజవాహనం
'ఆగజాంతగం ఐశ్వర్యం' అని ఆర్యోక్తి. గజం ఐశ్వర్య సూచకం. అలమేలు మంగ బ్రహ్మోత్సవ వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది.

సిరుల తల్లికి గజరాజుల నీరాజనం
బ్రహ్మోత్సవాలలో భాగంగా గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన సిరుల తల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని భాగవతంలో వివరించారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయని పెద్దలు అంటారు. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు అమ్మవారు ఐదవ రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికి, విశ్వానికి సంకేతమని పురాణం వచనం.

తిరుచానూరుకు చేరనున్న శ్రీవారి లక్ష్మీకాసుల హారం
తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో జరుగనున్న గజవాహన, గ‌రుడ వాహ‌న‌సేవ‌లో అమ్మవారికి అలంకరించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి మూలా విరాట్టుకు అలంకరించే అతి అమూల్యమైన ఆభరణం ల‌క్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకొస్తారు. తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని వైభ‌వోత్స‌వ మండ‌పానికి తీసుకువచ్చి అక్కడ నుంచి ప్రత్యేక వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తరలిస్తారు. ఆలయానికి చేరుకున్నాక హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఆల‌యంలోకి తీసుకెళ్తారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్తారు. ఈ హారాన్ని గజ వాహన సేవలో, గరుడ సేవలో అమ్మవారికి అలంకరిస్తారు.

గజవాహన దర్శనఫలం
గజవాహనంపై ఊరేగే సిరుల తల్లిని దర్శించినవారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తులతూగుతారని విశ్వాసం.

శ్రీవారిని దర్శించిన ఫలం
సాక్షాత్తూ శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించిన హారాన్ని అమ్మవారికి గజ వాహన సేవలో అలంకరిస్తారు. అందుకే గజ వాహనంపై అమ్మవారిని దర్శిస్తే సాక్షాత్తూ శ్రీనివాసుని దర్శించినట్లే అని వేంకటాచల మహత్యంలో వివరించారు. గజ వాహనంపై ఊరేగే సిరుల తల్లి అనుగ్రహం భక్తులందరిపై సదా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details