Thirukkarugavur Lord Shiva Temple : పరమశివునికి భోళా శంకరుడని పేరు ఉంది. తన భక్తులను కటాక్షించడానికి ఆ శివుడు అనేక చోట్ల స్వయంభువుగా వెలిసాడు. తమిళనాడులో తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకాలోని 'తిరుక్కరుగావూర్' పుణ్యక్షేత్రం పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
పుట్టమన్నుతో ఏర్పడిన శివలింగం
తిరుక్కరుగావూర్ పుణ్యక్షేత్రంలో పరమశివుడు ముల్లైవనాథర్గా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో విశేషమేమిటంటే ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో ఏర్పడిందంట! అందుకే ఈ శివలింగానికి జలాభిషేకాలు ఉండవు. ఇక్కడ శివలింగానికి పుష్పాలతోనే అభిషేకం జరుగుతుంది.
స్వామిని కొలిచిన మహా శివ భక్తులు
తమిళనాట గొప్ప కవిగా ఖ్యాతికెక్కిన జ్ఞాన సంబంధర్, సుందరార్ మొదలగు ఎందరో గొప్ప శైవ భక్తులు ఇక్కడ స్వామిని కొలిచినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి.
చర్మ సంబంధ వ్యాధులు మాయం
ఈ ఆలయంలో స్వామిని నియమ నిష్టలతో 11 సోమవారాలు మల్లెపూలతో కానీ, జాజిపూలతో కానీ అభిషేకిస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.
గర్భవతులను రక్షించే గర్భరక్షాంబికా
తిరుక్కరుగావూర్ ఆలయంలో పార్వతీదేవి గర్భరక్షాంబికా దేవిగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారు 7 అడుగుల సుందరమైన విగ్రహం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.